యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

పుట్టపర్తి టౌన్‌: కుటుంబ కలహాల కారణంగా బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన సోముశేఖర్‌ ( 25) ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎస్‌ఐ నారాయణరెడ్డి వివరాల మేరకు... బుక్కపట్నంకు చెందిన సోముశేఖర్‌ నిర్మాణంలో ఉన్న సత్యసాయి డిగ్రీ కళాశాలలో బీర్‌ బాటిల్‌తో గొంతు కోసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని తమ వాహనంలో ఎక్కించుకొని స్థానిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైనా వైద్యం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సరైన సమయంలో స్పందించిన పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

వైన్‌ షాపులో చోరీ

యాడికి: మండల పరిధిలోని రాయలచెరువులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక భాగాన ఉన్న బ్రాందీ షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. శనివారం రాత్రి దుండగులు వైన్‌ షాపు వెనుక భాగంలో గోడ పైన కన్నం వేసి షాపు లోపలికి చొరబడి రూ.2 లక్షల మద్యం బాటిళ్లు, రూ.23 వేల నగదును ఎత్తుకెళ్లారు. సీఐ శ్రీనివాసులు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ సభ్యులు చోరీ జరిగిన చోట వేలి ముద్రలు సేకరించారు.

విద్యుదాఘాతంతో

గొర్రెల కాపరి మృతి

కళ్యాణదుర్గం రూరల్‌ (కంబదూరు): వ్యవసాయతోటకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్‌ను తాకి గొర్రెల కాపారి మురళి (42) మృతి చెందిన సంఘన కంబదూరు మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కూడా గొర్రెలను మోపుకుంటూ వెళ్లాడు. వ్యవసాయ తోట రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైరును ప్రమాదశాత్తూ తాకడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య అక్కమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మహానాడుకు హాజరుకాని కూలీలకు వేధింపులు

కళ్యాణదుర్గం రూరల్‌: మండల పరిధిలోని గోళ్ల గ్రామంలో ఇటీవల టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యాక్రమానికి హాజరు కాలేదన్న కారణంతో టీడీపీ నేతలు ఉపాధి హామీ హామీ కులీలపై వేధింపులకు దిగారు. ఆదివారం ఉపాధి పనులు అధికారంగా నిర్వహించకూడదు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎర్రిస్వామి ఉపాధి హమీ పనులు నిర్వహించారు. అయితే మహానాడుకు హాజరుకాని కూలీలకు చెందిన ఫోటోలను మాత్రం తీయలేదు. ఎందుకు తమ ఫోటోలు తీయలేదని కొందరు కూలీలు నిలదీశారు. టీడీపీ నేతలతో పాటు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కూలీలతో మాట్లాడుతూ ‘మేము చెబితే మీటింగ్‌లకు తప్పకుండా హాజరుకావాలి.. మరోసారి ఇలా చేస్తే బాగుండదు’ అంటూ హెచ్చరించారు. అనంతరం వారి ఫోటోలను తీశారు. మహానాడుకు వెళ్లడం, వెళ్లకపోవడం అన్నది తమ వ్యక్తిగత విషయమని, వివిధ కారణాలతో వెళ్లడం సాధ్యపడలేదని కూలీలు చెబుతున్నారు. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కాకపోవడాన్ని సాకుగా చూపి కూలీలను ఇబ్బంది పెట్టడం సరికాదని గ్రామస్తులు తెలిపారు. కేవలం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎర్రిస్వామిపై చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై ఏపీఓను ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement