మధ్యాహ్నం వరకే వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం వరకే వైద్య సేవలు

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

నల్లచెరువు: మండల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్యసిబ్బంది మధ్యాహ్నం 2 గంటల వరకే విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిథ ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సిబ్బంది పని చేయాల్సి ఉంది. అయితే నల్లచెరువు మండలంలోని పాథ్రమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం నిబంధనలు తమకు వర్తించవు అన్నట్లుగా వైద్య అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 , 11 గంటలైనా విధులకు హాజరు కాని వైద్య అధికారులు మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పీహెచ్‌సీలో సేవలు అందిస్తున్నారు. ఉదయం ఓపీకి వచ్చిన రోగులను మాత్రమే చూసి తర్వాత తమకు సంబంధం లేనట్లు వెళ్లిపోతున్నారని రోగులు వాపోతున్నారు.

పర్యవేక్షణ కరువు

మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ఆలస్యంగా విధులకు వచ్చే సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలు దాటితే పత్తా లేకుండా పోతున్నారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు సిబ్బంది లేకపోవడంతో విధిలేక ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్ర ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో శనివారం, ఆదివారం సిబ్బంది ఉండటం లేదని తెలిపారు. ఆస్పత్రిలో వైద్య అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

వైద్యాధికారులు, సిబ్బందిపై

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement