బంగారంపేట పొలాల్లో మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

బంగారంపేట పొలాల్లో మృతదేహం లభ్యం

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

తాడిమర్రి: మండలంలోని బంగారంపేట, చిల్లకొండయ్యపల్లి గ్రామాల మధ్య ఆదివారం రైతులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్‌తో సేద్యం చేయిస్తుండగా డ్రైవర్‌ బోరు వద్ద పడి ఉన్న మృతదేహాన్ని చూసి రైతుకు తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ కృష్ణవేణి సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. దాడితోట సమీపంలోని కొండపైన జరుగుతున్న అదాని గ్రీన్‌ ఎనర్జీ హైడ్రో ప్రాజెక్టులో పని చేస్తున్న కూలీలు శనివారం ఇచ్చిన వ్యక్తి అదృశ్యం ఫిర్యాదు మేరకు ఆ దిశగా ఎస్‌ఐ విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి మృతదేహాన్ని పరిశీలించగా అదృశ్యమైన వ్యక్తిగా గుర్తించారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం గంగోటియా గ్రామానికి చెందిన ముగ్గురు పని కోసం నాలుగు రోజుల క్రితం ఆదానీ కంపెనీ వద్దకు వచ్చారు. వారిలో మతి స్థిమితం సరిగా లేని ప్రతాప్‌ ముండా (45) శుక్రవారం తన బావమరిదితో గొడవపడి అక్కడ నుంచి వచ్చాడు. మద్యం మత్తులో దారి తప్పి పొలాల్లోకి వెళ్లి కిందపడటంతో సృహతప్పి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య జాక్‌గ్రాణి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement