పెనుకొండ: ఎన్నో ఆశలతో ఈ ఏడు లాభాలు గడించవచ్చని ఆశించిన మామిడి రైతులు... పంట చేతికి వచ్చిన తర్వాత ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో కుదేలవుతున్నారు. విధి లేని పరిస్థితిల్లో మండీ వ్యాపారులు అడిగిన ధరకే కాయలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా... చివరకు రెక్కల కష్టమే మిగులతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభంలో ఫర్వాలేదనిపించినా ..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగులో ఉండగా, నెలరోజుల క్రితం దిగుబడి ప్రారంభంలో మంచి డిమాండ్ ఉండేది. తోతాపురి రకం టన్ను రూ.30 వేలకు పైగా అమ్ముడు పోయింది. చిరు వ్యాపారులు సైతం మార్కెట్‌లో కిలో రూ.60 చొప్పున విక్రయిస్తూ లాభాలు గడించారు. ఇలాంటి తరుణంలో కాయ పరిమాణం మరికాస్త పెరిగితే ధర కూడా ఆశించిన మేర ఉంటుందని పలువురు రైతులు భావించారు. దీంతో కోతలు ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా మామిడి ధరలు పతనమయ్యాయి. తోతాపురి టన్ను రూ. 5 వేల నుంచి రూ. 6 వేలలోపే పలుకుతోంది. గతంలో మార్కెట్లో టన్ను రూ. 50 వేలకు పైగా పలికిన బేనీషా, బాదామి, రాజ్‌బేనీషా, కసి, రస్పూరి వంటి మేలు రకాలను సైతం ప్రస్తుతం టన్ను రూ.20 వేలకు మించి అడగడం లేదు. హైదరాబాద్, నాగపూర్, బెంగళూరు వంటి దూర ప్రాంత మార్కెట్‌లకు కాయలను తీసుకెళుతున్నా గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందని ప్రభుత్వ సహకారం
మార్కెట్‌లో ధరలు పతనమై నష్టపోకుండా రైతులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కేవరకూ ఉత్పత్తులను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాక ప్రత్యేక రైలు మార్గం ద్వారా పంట ఉత్పత్తులను దేశంలోని మహానగరాలకు రవాణా చేయించి, ఉద్యాన తోటల రైతులకు లాభాలు దక్కేలా చొరవ తీసుకుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఉద్యాన రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారింది. పంటకు కనీస మద్ధతు ధర కల్పించకపోవడం, శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించకపోవడం తదితరాలతో ఉద్యాన రైతులు భారీగా నష్టాలను మూట గట్టుకోవాల్సి వస్తోంది.
తోతాపురి టన్ను రూ.6 వేలలోపే
కిలో రూ.20 దాటని ఇతర రకాలు
మామిడి రైతుల బతుకులు వీధిన పడుతున్నాయి. కాయలకు గిట్టుబాటు ధరలు దక్కక, ఆదాయం రాక, అప్పులు తీర్చలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గిట్టుబాటు ధరల్లేవు
మామిడి ధర ప్రారంభంలో కాస్త బాగున్నా కాయ పూర్తి సైజు వచ్చే సరికి ఒక్కసారిగా పడిపోయాయి. సగానికి పైగా ధరలు పడిపోవడం ఒక విధంగా రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. తోతాపురి రకం టన్ను 5 వేలు, బేనీషా, బాదామి ఇతర మేలు రకాలు టన్ను రూ. 20 వేలకు మించి పోవడం లేదు. దీంతో రైతుతో పాటు తోటలను కొనుగోలు చేసిన నాలాంటి వ్యాపారులు టన్నుపై రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది.
– వినోద్, వ్యాపారి, పెనుకొండ


