రైతు సమస్యలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలు పట్టవా?

May 31 2026 12:12 AM | Updated on May 31 2026 12:12 AM

అనంతపురం టవర్‌క్లాక్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారుల పని తీరులో చాలా మార్పులు వచ్చాయని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ప్రధానంగా తాగునీరు, వ్యవసాయం, వైద్యం, విద్య, విద్యుత్‌, వెల్ఫేర్‌ వంటి అంశాలపై చర్చ సాగింది.

అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చంద్ర మాట్లాడుతూ... ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా నేటికీ రైతులకు విత్తన వేరుశనగ పంపిణీపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఏ సాలురెడ్డి మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంగా ఆలస్యం చోటు చేసుకుందని, రైతులకు జూన్‌ 4 నుంచి విత్తన పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. జెడ్పీటీసీ నీలం భాస్కర్‌ మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌ తీసుకెళ్లినా నేటికీ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని అధికారులకు చైర్‌పర్సన్‌ సూచించారు. రైతులకు పంట నష్ట పరిహారం, బీమా పరిహారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని జెడ్పీటీసీ నాగరాజు గుర్తు చేశారు.

సర్వజనాస్పత్రిలో నెలకొన్న సమస్యలను జెడ్పీటీసీ చంద్ర ప్రస్తావిస్తూ... రోగులకు చాలీచాలని భోజనం పెడుతున్నారన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అంబులెన్స్‌లు ఏమయ్యాయని ప్రశ్నించారు.ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్‌లు లేకపోతే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గిరిజమ్మ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. సమగ్ర విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. కాగా, సమావేశానికి విద్యాశాఖాధికారులు గైర్హాజరు కావడంతో చైర్‌పర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌లో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

స్థాయీ సంఘ సమావేశంలో

అధికారులను నిలదీసిన

జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ

రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ఎప్పుడు చేపడతారని నిలదీత

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం

సర్వజనాస్పత్రిలో రోగులకు భోజనం సక్రమంగా అందివ్వాలని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement