వివాహిత బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

May 31 2026 12:12 AM | Updated on May 31 2026 12:12 AM

పుట్టపర్తి అర్బన్‌: అనారోగ్యం తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన ఆవుల వెంకటేష్‌కు ముగ్గురు కుమారులు కాగా, వీరిలో చిన్నవాడైన భాస్కర్‌కు రామగిరి మండలం శేషంపల్లికి చెందిన రామాంజనేయులు కోనమ్మ దంపతుల కుమార్తె మౌనిక(23)తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి ఆరు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందు నుంచే కడుపునొప్పితో మౌనిక బాధపడుతుండేది. బిడ్డ పుట్టిన అనంతరం నొప్పి తీవ్రమైంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేదనకు లోనైన మౌనిక శనివారం తెల్లవారుజామున ఇంట్లోని బెడ్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నారాయణరెడ్డి, తహసీల్దార్‌ కళ్యాణ్‌చక్రవర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఆటోను ఢీకొన్న కారు

బత్తలపల్లి: మండలంలోని తంబాపురం క్రాస్‌ వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని కలబురిగి జిల్లాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ మలింగ సిద్దలింగ దస్తారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. అక్కడ శ్రీవారి దర్శనం ముగించుకున్న అనంతరం శనివారం కారులో తిరుగు ప్రయాణమైన ఆయన.. తంబాపురం క్రాస్‌ వద్దకు చేరుకోగానే ఎదురుగా రామాంపురం నుంచి బత్తలపల్లికి ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఢీకొన్నాడు. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ బండి నారాయణస్వామి, బత్తలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, మాల్యవంతం గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 ద్వారా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎస్‌ఐ తిట్టాడని మహిళ ఆత్మహత్యాయత్నం

తలుపుల: స్థానిక ఎస్‌ఐ చెన్నయ్య బూతులు తిట్టారంటూ మండలంలోని సోమలవాండ్లపల్లికి చెందిన వై.మమత ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఓ కేసు విషయంగా మమత భర్త గంగిరెడ్డిని పోలీసులు శుక్రవారం స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో భర్తను దూషిస్తుంటే మమత అడ్డుకుంది. ఆ సమయంలో ఎస్‌ఐ రెచ్చిపోయి రాయలేని పదజాలంతో దుర్భాషలాడారు. న్యాయం చేయాలని కోరితే ఇలా దుర్మార్గంగా మాట్లాడడం సరికాదని అన్నందుకు ఏమైనా తాగి చావు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రత్యర్థుల నుంచి డబ్బు తీసుకుని తమను అన్యాయంగా కేసులో ఇరికించి గ్రామంలో పరువు తీసేందుకు సిద్ధమయ్యారంటూ మమత శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కదిరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనౖపై ఎస్‌ఐను ఆరా తీయగా... ఓ వివాదం విషయంగా ఇరు పార్టీలను తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేయించామని పేర్కొన్నారు. తాము ఎలాంటి దూషణలకు పాల్పడలేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement