● రెడ్డి జేఏసీ నేతల ధ్వజం
ధర్మవరం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని రెడ్డి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామాటం శేషాద్రిరెడ్డి, జిల్లా కార్యదర్శి చందమూరి శివారెడ్డి ధ్వజమెత్తారు. హైకోర్టు అడ్వకేట్ అంజన్‌రెడ్డి, చిగిచెర్ల అరవింద్‌రెడ్డిపై దాడులు, ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న నరేంద్రరెడ్డిని బూతులు తిట్టి ట్రాన్స్‌ఫర్ చేయడం, అర్హత ఉన్న రెడ్డి ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కకుండా అడ్డుపడటం, అనవసర బదిలీలు తదితరాలే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక రెడ్డి జేఏసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడంలో భాగంగానే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి గన్‌మెన్‌లను తొలగించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా పేరుతో నమోదైన కేసుల్లో 800 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఈ దాడులను అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న రెడ్డి ప్రజా ప్రతినిధులు, రెడ్డి నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ పట్టణాధ్యక్షుడు కృష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ఆదిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి మంజునాథ్‌రెడ్డి, రంగారెడ్డి, సనత్‌కుమార్‌రెడ్డి, కాటంరెడ్డి మాధవరెడ్డి పాల్గొన్నారు.


