పుట్టపర్తి: ‘టెట్’పై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2010 సంవత్సరానికి ముందు విధుల్లో చేరిన వారంతా తప్పనిసరిగా ‘టెట్’ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) రాయాల్సిందేనని తేల్చేసింది. అంతేకాదు..ఉద్యోగంలో కొనసాగాలంటే 2028 ఆగస్టు 31వ తేదీ లోపు ఉత్తీర్ణులు కావాల్సిందేనని శుక్రవారం తీర్పు చెప్పింది. దీంతో అయ్యవార్లలో అలజడి నెలకొంది. పాఠం చెప్పే తాము ఇప్పుడు మళ్లీ పాఠాలు నేర్చుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 8,300పైచిలుకు మంది ఉపాధ్యాయులు ఉండగా కేవలం 2,900 మంది మాత్రమే ‘టెట్’ పాస్ అయ్యారు. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు 400 మందికి మించి ఉండరు... దీనిప్రకారం 5 వేల మంది ‘టెట్’ తప్పని సరిగా పాస్ కావాల్సి ఉంది.
పదోన్నతులపై తీవ్ర ప్రభావం
ఏటా వేసవిలోనే టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ‘టెట్’ పాస్ అయిన వారికే ప్రమోషన్ కల్పించాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో వేలాది మంది టీచర్ల ప్రమోషన్ కల ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది సీనియర్లు పదోన్నతులు కోల్పోనున్నారు.
ఇన్‌సర్వీస్ టీచర్లకు ‘టెట్’ తప్పనిసరి
తాజాగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
జిల్లాలోని 5,000 మందిపైప్రభావం
చంద్రబాబు, లోకేష్ హామీ నిలబెట్టుకోవాలని టీచర్ల డిమాండ్
మినహాయింపు ఇవ్వాలి
టెట్ నుంచి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయాలి. 30 ఏళ్లుగా బోధనా వృత్తిలో కొనసాగుతున్న వారికి పరీక్ష పెట్టడం సరికాదు. పదోన్నతులకూ ‘టెట్’ ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడం కూడా దుర్మారం. ఉపాధ్యాయుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘టెట్’ను ప్రామాణికంగా తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం.
– కాడిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎస్టీఏ
హిందూపురంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రవి అనే ఉపాధ్యాయుడు కొన్నేళ్లుగా పిల్లలకు గణితం బోధిస్తున్నాడు. ఆయన సర్వీసు కూడా ఆరేళ్లు మాత్రమే ఉంది. సుప్రీం తీర్పు నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ‘టెట్’ తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంది. 150 మార్కులకు నిర్వహించే ‘టెట్’లో తాను చెప్పే గణితానికి సంబంధించి 30 మార్కులే ఉంటాయని, మిగతా 120 మార్కులకు తాను సోషల్, తెలుగు తదితర సబ్జెక్టులు ఇప్పుడు చదువుకోవాల్సి వస్తోందని రవి ఆవేదన వ్యక్తం చేశాడు.
..ఇలా జిల్లాలోని టీచర్లంతా ‘టెట్’కు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వస్తే తాము బోధించే సబ్జెక్టుపైనే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.


