పుట్టపర్తి అర్బన్ /ధర్మవరం అర్బన్: ఉరుములు... మెరుపులు..భారీగాలులతో కూడిన వాన జిల్లాను ముంచెత్తింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన వాన రాత్రి 9 గంటల వరకూ కురిసింది. ప్రధానంగా తాడిమర్రి, ధర్మవరం, చిలమత్తూరు, పుట్టపర్తి, కొత్తచెరువు ,గోరంట్ల హిందూపురం తదితర ప్రాంతాల్లో 2 గంటలకుపైగా దంచేసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిలమత్తూరులోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడి చెట్టు కాలి పోయింది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడక్కడా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. తాజా వర్షాలతో ఖరీఫ్ సాగుకు మేలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు.
ధర్మవరంలో కుండపోత
ధర్మవరంలో శనివారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పట్టణంలోని రహదారులన్ని జలమయమయ్యాయి. చేనేతల ఇళ్లల్లోని మగ్గం గుంతల్లో వర్షపునీరు చేరడంతో సామగ్రి తడిసిపోయింది. ఎన్టీఆర్ సర్కిల్‌లో ప్రధాన రహదారి మొత్తం జలదిగ్భంధమైంది. దుకాణాల్లోకి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారుల్లో వర్షపునీరు నిలవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.


