పెనుకొండ రూరల్: ‘‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వే సమయంలో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి. బీఎల్‌ఓల వెంట ఉంటూ అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలి. అలాగే నూతన ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలి.’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పార్టీ బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజక వర్గంలోని బీఎల్‌ఓలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... ‘సర్’ సర్వే సమయంలో బీఎల్‌ఓఏల వెంట బీఎల్‌ఏలతో పాటు పార్టీ ముఖ్యనాయకులు ఇంటింటి పరిశీలనకు వెళ్లాలన్నారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, మృతుల ఓటర్లును గుర్తించాలన్నారు. అధికారులు సమక్షంలో అక్కడికక్కడే నిర్ధారించుకోవాలన్నారు. అర్హత కలిగిన ఏ ఓటు తొలగించకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి ఓటూ బంగారం కంటే విలువైనదిగా భావించాలన్నారు. బీఎల్‌ఓలు, నాయకులు సమష్టి కృషితో పనిచేస్తే స్థానిక సంస్థలలో పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు.
అన్‌మ్యాప్డ్ ఓటర్ల ఆధారాలు సిద్ధం చేయండి
2002 తర్వాత ఓటు హక్కు పొందిన ఓటర్లను అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా పరిగణిస్తారని, అలాంటి ఓటర్ల ఆధారాలు సిద్ధం చేసుకోవాలని బీఎల్‌ఏలకు ఉషశ్రీచరణ్ సూచించారు. ఇంటి యజమాని ఓటు కార్డు మ్యాప్ అయి ఉంటే చాలని, కుటుంబ సభ్యులు ఓటరు కార్డు మ్యాప్ కాకపోయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకు సంబంధించిన జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, భూమి పాసు పుస్తకం, ఇంటి పట్టా, పదో తరగతి ఉత్తీర్ణత పత్రం, పాస్ పోర్టు... ఇలా 13 రకాల పత్రాల్లో ఏవైనా రెండు త్రాలు అధికారులకు అందజేస్తే సరిపోతుందన్నారు.
‘సర్’ సర్వేలో కీలకంగా వ్యవహరించాలి
అర్హులైన వారి ఓట్లు తొలగకుండా చూసుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
ఒక్క ఓటూ తొలగిపోకూడదు
‘సర్’ సర్వేలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్‌ఏలు చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీను మహేష్, పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర సూచించారు. పార్టీ ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో శ్రీసత్యసాయి జిల్లా ఇప్పటికే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ‘సర్’ పరిశీలనలోనూ నిజమైన ఓటర్లు తొలగించకుండా జాగ్రత్త పడుతూ తక్కువ ఓటర్లు తొలగించిన జిల్లాలో మొదటి స్థానంలో నిలువాలన్నారు. గ్రామస్థాయి నాయకులంతా విధిగా సర్వే సమయంలో బీఎల్‌ఓల వెంట ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే స్పందించాలన్నారు. సమస్య మీ పరిధిలో పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చి ఓట్లు తొలగిపోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి, పోలింగ్ బూత్‌ల జోన్–5 ఇన్‌చార్జ్ సురేష్, బూత్ కమిటీల నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇమాం వలి, ఐదు మండలాల బూత్ కమిటీల కన్వీనర్లు, బోయ రాము, విజయ్ కుమార్‌రెడ్డి, చిలకల రవి, గంగాధర్ రెడ్డి, బలిజ సుబ్రహ్మణ్యం, ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, నరసింహ మూర్తి, తిమ్మయ్య, వెంకటేష్, శంకర్, శ్రీనివాస్, గజేంద్ర, పలువురు ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.


