పుట్టపర్తి టౌన్: అర్బన్ సీఐ తిమ్మారెడ్డిని వీఆర్‌కు పంపుతూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే పుట్టపర్తి అర్బన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న తిమ్మారెడ్డి... అతి తక్కువ కాలంలోనే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అనంతపురం వీఆర్‌కు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తిమ్మారెడ్డి పనితీరుతో ఇబ్బంది పడిన కూటమి నాయకులు తనదైన శైలిలో స్థానిక ప్రజా ప్రతినిధులు వద్ద పావులు కదపడంతో ఉన్నతాధికారులు ఆయన్ను వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా, జిల్లా కేంద్రంలో శాంతి భద్రతలు, ప్రొటోకాల్ రీత్యా ప్రశాంతి నిలయం సెక్యూరిటీ వింగ్ సీఐగా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని అర్బన్ సర్కిల్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు.
ప్రశాంతంగా
‘పది’, ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి: పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పదో తరగతి విద్యార్థులకు శనివారం 23 కేంద్రాల్లో ఫిజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 2,794 మంది హాజరుకావాల్సి ఉండగా 2,233 మంది హాజరు కాగా, 561 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. అలాగే ‘ఓపెన్’ విద్యార్థులు 171 మందికి గాను 130 మంది హాజరు కాగా, 41 మంది గైర్హాజరయ్యారన్నారు.
ఇంటర్ పరీక్షలకు 171 మంది గైర్హాజరు
32 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 171 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష నిర్వహించగా...1,255 మందికి గాను 1,166 మంది హాజరయ్యారని డీఐఈఓ వెల్లడించారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 828 మందికి గాను, 746 మంది విద్యార్థులు హాజరు కాగా, 82 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
జూన్ 5 నుంచి కళాశాలలు ప్రారంభం
జూనియర్ కళాశాలలో మరో 5 రోజులు వేసవి సెలవులు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జూన్ 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
వలస కూలీల వాహనం బోల్తా
●బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం
రాప్తాడు రూరల్: వలస కూలీలతో బయల్దేరిన వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన 23 మంది కూలీలు కేరళలో ఉపాధి కోసం శుక్రవారం రాత్రి క్రూషర్ వాహనంలో బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున రాప్తాడు మండల పరిధిలోని కార్బన్ సిటీ వద్ద 44వ జాతీయ రహదారికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో మహిపాల్ (16) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రంజిత్ యాదవ్ (21)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన పలువురు కూలీలను స్థానికులు అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.


