‘సర్‌’ సర్వేకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ సర్వేకు సహకరించండి

May 31 2026 12:12 AM | Updated on May 31 2026 12:12 AM

రాజకీయ పార్టీలకు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పిలుపు

ప్రశాంతి నిలయం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌– సర్‌) సర్వే జిల్లాలో పక్కాగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వివిధ పార్టీల నాయకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జూన్‌ 5 నుంచి 14వ తేదీ వరకూ సన్నాహక కార్యక్రమాలు, సిబ్బందికి శిక్షణ, ఓటరు గణన ఫారాల ముద్రణ ఉంటుందన్నారు. జూన్‌ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు గణన ఫారాలను పంపిణీ చేసి వివరాలను సేకరిస్తారన్నారు. ఏ ఇంటికై నా తాళం వేసి ఉంటే.. సదరు ఇంటిని కనీసం మూడు సార్లు బీఎల్‌ఓలు సందర్శిస్తారన్నారు. జూలై 21న ముసాయిదా డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా విడుదల చేస్తామని, జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అన్నీ పరిష్కరించి సెప్టెంబర్‌ 22వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా సర్‌ సర్వే సాగుతుందన్నారు. అలాగే నకిలీ ఓట్లు లేని స్వచ్ఛమైన జాబితా కోసం రాజకీయ పార్టీలు నియమించుకునే బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ కొండయ్య, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement