పుట్టపర్తి: ‘‘మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించి డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు పాతరేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన నిర్వాకానికి అర్హులైన వేలాది మంది విద్యార్థుల కుటుంబాలు బలవుతున్నాయి. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐతో న్యాయ విచారణ చేయించాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, అప్‌లోడ్, నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలి. మెరిట్ లిస్ట్, మార్కులు, ఎంపిక వివరాలను పూర్తిగా ప్రజలకు వెల్లడించాలి’’ అని వైఎస్సార్ విద్యార్థి (వైఎస్సార్ ఎస్‌యూ) విభాగం నేతలు డిమాండ్ చేశారు. డీఎస్పీలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పుట్టపర్తి గణేష్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే డీఎస్సీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
అన్నీ అనుమానాలే..
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో మెరిట్ లిస్ట్‌ను పక్కన పెట్టి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వైఎస్సార్ ఎస్‌యూ నేతలు ఆరోపించారు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా కేవలం ఎంపికై న విద్యార్థులకు మాత్రమే సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపడం, కాల్ లెటర్ల విషయంలో గందరగోళం సృషించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తూ డీ మెరిట్ విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చారన్నారు. కనీసం అభ్యంతరాలకు గడువు కూడా ఇవ్వలేదన్నారు. భవి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల నియామకంలోనే తప్పులు చేసి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మెగా డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నా... మంత్రి లోకేష్ మొద్దు నిద్రలో ఉన్నారన్నారు. ప్రభుత్వ చర్యలతో నష్ట పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్‌నాథ్‌రెడ్డి, ధర్మవరం, పుట్టపర్తి నియోజక వర్గం అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, మహేష్, అమడగూరు అధ్యక్షుడు చరణ్, ధర్మవరం పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు శ్రీనాథ్ తదితరులు ఉన్నారు.
నిరుద్యోగులను మోసం చేసిన
చంద్రబాబు సర్కార్
పోస్టులను అమ్ముకోవడం సిగ్గుచేటు
మంత్రి నారా లోకేష్ పదవికి
రాజీనామా చేయాలి
సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
నిరసన తెలిపిన
వైఎస్సార్ ఎస్‌యూ నాయకులు
సీబీఐతో విచారణ చేయించాలి
మెగా డీఎస్సీలో జరిగిన తప్పులను సరిదిద్ది అర్హులకు న్యాయం చేయడానికి సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించాలి. మంత్రి నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఏటా ఉద్యోగాల క్యాలెండర్, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసగిస్తున్నారు. మరో మూడేళ్లలో మీ పాపం పండనుంది.
– వేముల అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర అధికార
ప్రతినిధి, వైఎస్సార్ విద్యార్థి విభాగం
‘క్రీడల కోటా’ అభ్యర్థులకు న్యాయం జరగాలి
మెగా డీఎస్సీలో ‘క్రీడల కోటా’లో దరఖాస్తు చేసిన వారికి న్యాయం చేయాలి. మెరిట్ లిస్ట్‌ను వెంటనే ప్రజలకు తెలిసేలా బహిర్గతం చేయాలి. ఎంపిక విషయాన్ని ఎందుకు అభ్యర్థులకు మాత్రమే ఎస్‌ఎంఎస్‌లు పంపారో తెలియజేయాలి. కాల్ లెటర్ల విషయంలో ఎందుకు గందరగోళం జరిగింది. స్పోర్ట్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
వైఎస్సార్ విద్యార్థి విభాగం
ఇది దగా డీఎస్సీ
చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ దగా డీఎస్సీగా మారిపోయింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతగానితనంతో వేలాది మంది అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. లోటు పాట్లను సవరించకుండా... అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకుండా వారిపైనే దాడులకు తెగబడడం విడ్డూరంగా ఉంది. అర్హులకు న్యాయం జరగక పోతే పోరాటం ఉధృతం చేస్తాం. – పురుషోత్తం రాయల్,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ విద్యార్థి విభాగం


