ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను గడువులోపు ఇవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పరిశ్రమలు ఉత్పత్తి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌డీపీ పోస్టల్ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలన్నారు. అనంతరం నెడ్‌క్యాప్ ద్వారా చేపడుతున్న సౌరశక్తి ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకంపై ఎస్‌పీడీసీఎల్ అధికారులతో చర్చించారు. పరిశ్రమలకు సబ్సిడీలు, పీఎం విశ్వకర్మ ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు, జెడ్‌ఎం నాగముని, ఏపీఐఐసీ ప్రతినిధి శశికళ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని 23 కేంద్రాల్లో మేథమెటిక్స్ పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు 2,546 మందికి గాను 2,086 మంది హాజరుకాగా, 460 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఇక ‘ఓపెన్ స్కూల్’ విద్యార్థులు 213 మందికి గాను 171 మంది హాజరు కాగా, 42 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వెల్లడించారు. మొత్తంగా 502 మంది గైర్హాజరయ్యారన్నారు.
ఇంటర్ పరీక్షకు 300 మంది గైర్హాజరు
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జనరల్ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ఫిజికల్ సైన్స్ పరీక్ష జరిగింది. జిల్లాలోని 32 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులు 3,633 మందికి గాను 3,410 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 776 మందికి గాను 699 మంది విద్యార్థులు హాజరు కాగా, 77 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తంగా శుక్రవారం 300 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
‘కియా’ యాజమాన్యంపై కలెక్టర్ ఆగ్రహం
● ప్రమాదాల నివారణకు చర్యలు
తీసుకోవడం లేదని అసంతృప్తి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని ఎన్‌హెచ్–44 పరిధిలో ‘కియా’ ఫ్యాక్టరీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని, అలాగే ఆ ప్రాంతంలోని రోడ్ల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సతీష్‌కుమార్, జిల్లా రవాణా అధికారి కరుణసాగర్‌రెడ్డితో కలిసి రహదారి భద్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంలోనే ‘కియా’ వద్ద జరిగిన ప్రమాదాల గురించి అధికారులు వివరించగా...కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కియా యాజమాన్యం వెంటనే రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. హరిపురం, అమ్మవారిపల్లి, పుట్టపర్తి క్రాస్, దుద్దేబండ క్రాస్, గుట్టూరు క్రాస్ వద్ద తక్షణమే రంబుల స్ట్రిప్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలన్నారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం, లింగారెడ్డిపల్లి క్రాస్ వద్ద ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను కట్టడి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


