విలేకరి ముసుగులో వసూళ్లు! | - | Sakshi
Sakshi News home page

విలేకరి ముసుగులో వసూళ్లు!

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: పరిటాల అనుచరుడినని చెప్పుకొంటూ విలేకరి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ఓ యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టర్‌ను నంద్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...రామగిరి మండలం పీఆర్‌ కొట్టాలకు చెందిన వై.రవి తాను ప్రజాటీవీ చానల్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌నని చెప్పుకుంటూ పలువురిని బెదిరింపులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ భార్గవరెడ్డినీ బెదిరింపులకు గురిచేశాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చానల్లో డాక్టర్‌, ఆస్పత్రి గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యుడు గతంలో రూ.4 వేలు ఇచ్చి పంపించాడు. అయితే రెండు రోజుల క్రితం మళ్లీ డబ్బుల కోసం ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాడు. అయితే డాక్టర్‌ భార్గవరెడ్డి లెక్కచేయకపోవడంతో గురువారం రాత్రి నేరుగా నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇందుకు డాక్టర్‌ తిరస్కరించడంతో ఆస్పత్రిలో హంగామా చేశాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నంద్యాల త్రీటౌన్‌ పోలీసులు రవిని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతనిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్‌ తెలిపారు.

హరిజన రవి చరిత్ర ఆది నుంచీ నేరమయమేనని పీఆర్‌ కొట్టాల గ్రామస్తులు తెలిపారు. చేతికి ‘పరిటాల రవి’ అని పచ్చబొట్టు వేయించుకుని పరిటాల కుటుంబానికి తాను ముఖ్య అనుచరుడినని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడన్నారు. తరువాత కులసంఘాల పేరుతో చాలా చోట్ల బెదిరింపులకు పాల్పడుతూ దందాలు కొనసాగించాడన్నారు. ప్రస్తుతం ప్రజాటీవీ విలేకరినని చెప్పుకుంటూ వ్యాపారులను, ఇతరులను బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అంతేకాకుండా తరచూ అనంతపురం నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంలో వెళ్తూ మార్గమధ్యంలోని పలు పట్టణాల్లోని ప్రముఖులను బెదిరించేవాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రవిపై అనంతపురం వన్‌టౌన్‌, టూటౌన్‌, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు పీఆర్‌ కొట్టాల వాసులు తెలిపారు. తాజాగా నంద్యాలలోనూ వైద్యుడిని బెదిరించి కటకటాల పాలయ్యాడని వెల్లడించారు.

‘పరిటాల’ అనుచరుడు రవి దందా

డబ్బుల కోసం నంద్యాలలో

ఓ వైద్యుడికి బెదిరింపులు

అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన

నంద్యాల పోలీసులు

రవి చరిత్ర అంతా నేరమయం..

Advertisement
 
Advertisement
Advertisement