ఈ మ్యాచ్‌లో ఫలానా జట్టే గెలుస్తుంది. పందెం రూ.10 వేలు. ఈ ఓవర్లో వికెట్ పడుతుంది. మీది రూ.వెయ్యి మాది రూ.800, ఈ పార్టనర్ షిప్‌లో హాఫ్ సెంచరీ చేస్తారు. పందెం రూ.20 వేలు... ఇలా హిందూపురం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజూ సాయంత్రం నుంచి క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.కోట్లలో చేతులు మారినట్లు సమాచారం.
హిందూపురం: ఐపీఎల్ సీజన్ ప్రారంభనుంచి హిందూపురం పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఈ బాగోతంలో బెంగళూరు ప్రాంతానికి చెందిన బుకీలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. క్రీడా పరిజ్ఞానం ఉన్న యువకులతో పాటు ఇతర జూదాలలో రాటుదేలిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌లలో బిజీగా ఉంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో సాగుతుండడంతో అడ్డుకట్ట వేయడం పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. బెట్టింగ్‌లో ఇప్పటికే హిందూపురం పట్టణానికి చెందిన ఓ వ్యాపారి తొలుత రూ.2లక్షల వరకు గెలిచినట్లు సమాచారం. తర్వాత రూ.20 లక్షల వరకూ పోగొట్టుకున్నట్లు వదంతులు వినవస్తున్నాయి. దీంతో సదరు వ్యాపారి హిందూపురాన్ని వదిలి మరో ఊరిలో స్థిరపడినట్లుగా చెబుతున్నారు. అలాగే బోయపేటకు చెందిన ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో బంగారు గొలుసు, బైక్, డబ్బు పోగొట్టుకుని బెంగళూరు వెళ్లిపోయాడు.
జట్టు బలాల ఆధారంగా
ఐపీఎల్‌లో తలపడుతున్న జట్ల బలాబలాల ఆధారంగా బెట్టింగ్ సాగుతోంది. అందిన సమాచారం మేరకు ఒక ఓవర్‌లో పరుగులు, వికెట్లు పడే సమయాలు, నో బాల్, వైడ్లు ఎప్పుడు పడతాయి, ఫోర్లు, సిక్సర్లు ఎప్పుడు కొడతారు.. ఇలా ప్రతి నిమిషానికి రూ.వేలు, రూ.లక్షల్లో బెట్టింగ్ కడుతున్నారు. చివరకు మ్యాచ్ ఫలితంపై కూడా భారీ బెట్టింగ్ సాగుతోంది. ఒక జట్టు బలహీనంగా ఉంటే దానిపై తక్కువ మొత్తం పందెం కాస్తున్నారు. బలమైన జట్టు వైపు ఉన్నవారు దానికి కాస్త ఎక్కువ మొత్తం బెట్టింగ్ కడుతున్నారు. హిందూపురంలోని బార్లు, టీ కేఫ్‌లు, ధాబాల్లో బెట్టింగ్ రాయుళ్లు గంటల తరబడి బైఠాయించి మ్యాచ్ ఫలితం తేలేవరకూ వేచి ఉండడం గమనార్హం.
బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా
హిందూపురంలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్
బెట్టింగ్ కేంద్రాలుగా బార్లు, టీ కేఫ్‌లు, ధాబాలు
చేతులు మారుతున్న రూ.కోట్లు
క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్
ఐపీఎల్ సీజన్ సందర్భంగా పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం ఏఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి తూమకుంట వద్ద హిందూపురం రూరల్ సీఐలు చంద్ర, ఆంజనేయులు, సిబ్బంది తనిఖీలు చేపట్టిన సమయంలో క్రికెట్ బెట్టింగ్ సాగిస్తూ సందీప్‌కుమార్, తిమ్మారెడ్డి, మర్రబల్లి శ్రీనివాసరెడ్డి పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.13.20 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో హిందూపురం సీఐలు ఆంజినేయులు, జనార్థన్, రాజగోపాలనాయుడు, అబ్దుల్‌కరీం తదితరులు పాల్గొన్నారు.


