ఎన్‌పీకుంట: స్థానిక శివాలయం వద్ద ఉన్న కమ్యూనిటీ భవనంలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం చర్చనీయాంశమయ్యింది. మండల పరిధిలోని వెలిచలమల, పడమరనడిమిపల్లి, ఎదురుదోన పంచాయతీలకు చెందిన నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున వేతనం పొందుతున్న వీరు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే నిబంధన ఉంది. అయినా నిబంధనలు బేఖాతరు చేస్తూ టీడీపీ లోగోలు, ట్యాగులు ధరించి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.
మండ్లిపల్లిలో పట్టపగలే చోరీ
తనకల్లు: మండలంలోని మండ్లిపల్లిలో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామంలోని దళిత వాడలో 43వ జాతీయ రహదారి పక్కనే నివాసముంటున్న రమణమ్మ శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు రమణమ్మ ఇంటి తాళం తొలగించి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు కలావర్లు, వెండి గొలుసులతో పాటు రూ. 6 వేలు నగదు అపహరించారు. మరో గదిలో ఉన్న ఎనిమిది బస్తాల బియ్యాన్ని ఆటోలో వేసుకుని వెళ్లిపోయారు. కూలి పనుల నుంచి ఇంటికి చేరుకున్న రమణమ్మ తలుపులు తెరచి ఉండడంతో అనుమానంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ దిలీప్ కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ట్రావెల్ బస్సు బోల్తా
గోపవరం: వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పరిధిలోని 67వ జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు రెండో మలుపు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బీసీవీఆర్ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు బోల్తాపడింది. విజయవాడ నుంచి కదిరికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా తలుపులకు చెందిన పవన్‌కుమార్, కదిరికి చెందిన శ్రీనివాసులుతో పాటు కడప జిల్లా కె.రాజుపాలెంకు చెందిన జయప్రసాద్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బద్వేలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై బద్వేలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
హిందూపురం టౌన్: కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. హిందూపురం మండలం తూమకుంట పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీ, ఫ్లో కేమ్ ఫ్యాక్టరీ, తిరుమల స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే బ్రిడ్జి వద్ద కర్ణాటక మద్యం దందా సాగుతున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో నలుగురు పట్టుబడగా, వారి నుంచి 90 ఎంఎల్ సామర్థ్యం కలిగిన 9 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తూ నలుగురు పాత నిందితుల్లో ఒక్కొక్కరికి ఏడాది కాలానికి రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు.


