మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

ప్రశాంతి నిలయం: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చి దిద్దాలని అధికారులకు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జరిగిన ఎన్‌– కార్డ్‌ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. పాత కేసుల్లోని నిందితులపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు వారిని బైండోవర్‌ చేయాలన్నారు. బెల్ట్‌ షాపులను నిర్మూలించాలన్నారు. యువత డ్రగ్స్‌ బారిన పడకుండా అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో ఎకై ్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌, డీపీఈఓ గోవింద నాయక్‌, ఏఈఎస్‌ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

2న జిల్లా ఫుట్‌బాల్‌ బాలికల జట్ల ఎంపిక

హిందూపురం టౌన్‌: స్థానిక ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో జూన్‌ 2న జిల్లా సబ్‌ జూనియర్‌, జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో 2013 జనవరి నుంచి 2014 డిసెంబర్‌ మధ్య జన్మించిన వారై ఉండాలి. జూనియర్స్‌ విభాగంలో 2011 జనవరి నుంచి 2012 డిసెంబర్‌ మధ్య జన్మించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, మూడు ఫొటోలు, తల్లిదండ్రుల సమ్మతి పత్రం తీసుకుని మంగళవారం ఉదయం 10 గంటలకు క్రీడా మైదానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 80995 98958 లో సంప్రదించవచ్చు.

మాజీ మంత్రి వెంకటరమణప్ప ఇక లేరు

పావగడ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, స్థానిక మాజీ మంత్రి వెంకటరమణప్ప(84) గుండెపోటుతో కన్ను మూశారు. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు వెంకటేష్‌ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017లో భార్య శారదమ్మ మృతి చెందారు. తాలూకాలోని హనుమంతనహళ్లిలోని తన స్వగృహంలో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను బెంగుళూరులోని ఫోర్టీస్‌ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పావగడలోని గురుభవన్‌ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. వందలాది మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్ని వెంకటరమణప్ప భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

యువతి అదృశ్యం

అగళి: మండలంలోని హళ్లికేర గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప నాల్గో కుమార్తె అంజలి కనిపించడం లేదు. పోలీసులు తెలిపిన మేరకు... 19 సంవత్సరాల వయసున్న అంజలి కర్ణాటకలోని దొడ్డేరి హోబళి రంగాపురంలో తన చిన్నాన్న నాగరాజు నూతనం నిర్మిస్తున్న ఇంటికి వెళ్లింది. గురువారం సాయంత్రం బహిర్భూమికని బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని తమ్ముడు నాగరాజు ఫోన్‌ చేయడంతో హనుమంతరాయప్ప... బంధువుల సాయంతో చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు చేపట్టాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు ఎస్‌ఐ రంగడు యాదవ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement