జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
రొద్దం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో రొద్దం మండలం కంబాలపల్లికి చెందిన ఊటుకూరు మానద్న (60) దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిపై మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన, పని ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా కోగిర సమీపంలో ఎల్‌జీబీనగర్ వైపు నుంచి కోగిర గ్రామానికి చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనంలో ఎదురుగా వస్తూ ఢీకొన్నారు. ఘటనలో రోడ్డుపై పడిన మాదన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న నరసింహులతో పాటు బాలలు రాహుల్, భరత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 లో పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. రాహుల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మడకశిర రూరల్: స్థానిక 544ఈ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని మధుగిరి తాలూకా ఐడీహళ్లి పంచాయతీలోని చౌలిపల్లికి చెందిన నరసింహయ్య (62), జగన్.. గొర్రెల వ్యాపార నిమిత్తం శుక్రవారం ద్విచక్ర వాహనంపై మడకశిర మండలం ఈచలెడ్డి గ్రామానికి వచ్చారు. పశువుల వ్యాపారి చెన్నయ్య గురించి ఆరా తీయడంతో ఆయన గ్రామంలో లేడని తెలుసుకుని మడకశిర వైపుగా బయలుదేరారు. అయ్యవారిపల్లి ప్రధాన కూడలికి చేరుకోగానే జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి కిందపడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా మడకశిరలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరసింహయ్య (62) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం జగన్‌ను తుమకూరులోని ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై ఎస్‌ఐ లావణ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


