విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

May 30 2026 8:53 AM | Updated on May 30 2026 8:53 AM

హిందూపురం టౌన్‌: ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వల్లరాజు తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హిందూపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు పేరుకుపోయాయన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను కేవలం ప్రకటనలతో మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీజీ విద్యార్థులకు భారంగా మారిన జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం దారుణమన్నారు. మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన తరుణంలో వాటిని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే విధానాలు సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. విద్యార్థులను సామాజిక, రాజకీయ చైతన్యంతో కూడిన ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దడానికి జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలులో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, మహేంద్ర, నాయకులు చంద్ర, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వల్లరాజు

Advertisement
 
Advertisement
Advertisement