కేబుల్‌ కత్త్తిరిస్తూ పట్టుబడిన దొంగ | - | Sakshi
Sakshi News home page

కేబుల్‌ కత్త్తిరిస్తూ పట్టుబడిన దొంగ

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

క్లుప్తంగా

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): వ్యవసాయ బోరుబావి వద్ద కేబుల్‌ కత్తిరిస్తూ రైతులకు ఓ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామ శివారున ఉన్న రైతు పొలంలో బోరు బావి వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి కేబుల్‌ కత్త్తిరిస్తుండగా రైతులు గుర్తించి, వెంటనే బంధించారు. విచారణలో బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గురువారం కేసు నమోదు చేశారు.

‘దుర్గం’లో పోలీసుల దందా!

కళ్యాణదుర్గం రూరల్‌: స్థానిక అర్బన్‌ పోలీసులు తీరు వివాదాస్పదమవుతోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న యువకులను విచారణ పేరుతో స్టేషన్‌కు పిలుచుకెళ్లి అందిన కాడికి డబ్బు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం బక్రీద్‌ సందర్భంగా కొందరు యువకులు పట్టణ సమీపంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని, వారి సెల్‌ఫోన్లను లాక్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకెళ్లి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఒక్కొక్కరి ద్వారా వసూలు చేసుకుని వదిలేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులను వివరణ కోరగా స్పందించలేదు.

బాలిక ఆత్మహత్య

ఎన్‌పీకుంట: తల్లి మందలింపుతో మనస్థాపం చెంది ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... ఎన్‌పీకుంట మండలం కటకంవారిపల్లికి చెందిన వల్లెపు నవ్య (14) ఇంటి పనులు సరిగా చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం తెల్లవారుజామున బాత్రూమ్‌లో పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణమూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.

నగరంలో ఇద్దరి బలవన్మరణం

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయకాలనీలో నివాసముంటున్న గుజ్జల నాగార్జున భార్య గాయత్రి (35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇందిరానగర్‌లో నివాసముంటున్న కొలిమి మహమ్మద్‌ రఫి(36) గురువారం వేకువజామున ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రఫీ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చెరువులో వృద్ధురాలి మృతదేహం

గార్లదిన్నె: మండలంలోని జంబులదిన్నె చెరువు సమీపంలో ముళ్లకంపల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి అశ్విణ్‌ మణిదీప్‌, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కౌలుట్లయ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 20 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఖననం చేశారు. మిస్సింగ్‌ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే గార్లదిన్నె పోలీసులను సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement