క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

రూ.7.20 లక్షల నగదు స్వాధీనం

మడకశిర: నియోజకవర్గ కేంద్రంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్‌ చేసినటులపెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప తెలిపారు. గురువారం మడకశిర పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అర్బన్‌ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ లావణ్యతో కలిసి వివరాలను ఆయన వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ సుధీర్‌, సతీష్‌, దేవరాజ్‌, ఇర్ఫాన్‌ పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.7.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్‌ రాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్‌

తలుపుల: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు రూరల్‌ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు. గురువారం వివరాలను ఆయన వెల్లడించారు. తలుపుల మండలం పులిగుండ్లపల్లి సమీపంలోని పెద్దపులి కొండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో రాజనాలవాండ్లపల్లికి చెందిన గంగాద్రి పారిపోగా, ముఠా సభ్యుల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి పోలీసులు రెండు కార్లు, పార, గునపం, రెండు గోలాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంగాద్రి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

నాటుసారా విక్రేత అరెస్ట్‌

ధర్మవరం: మండలంలోని నేలకోటతండాకు చెందిన వడిత్యా శంకర్‌నాయక్‌ నాటు సారా విక్రయిస్తూ పట్టుబడినట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ చంద్రమణి, ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. గురువారం వివరాలను వెల్లడించారు. అందిన సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు చేపట్టిన సమయంలో శంకర్‌నాయక్‌ పట్టుబడ్డాడని, అతని వద్ద నుంచి 2 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

రైలు ఢీకొని వృద్ధురాలికి

తీవ్ర గాయాలు

రాయదుర్గం టౌన్‌: రైలు ఢీకొన్న ఘటనలో స్థానిక సీబీఎన్‌ కాలనీకి చెందిన శంకరమ్మ(70) తీవ్రంగా గాయపడింది. కాలనీకి ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై పావగడ రైల్వేస్టేషన్‌ నుంచి రెండు బోగీలు ఉన్న తనిఖీ రైలు గురువారం సాయంత్రం రాయదుర్గం స్టేషన్‌కు చేరుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బహిర్భూమి కోసం పట్టాలు దాటుతున్న శంకరమ్మను రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. తల, కాలుకు తీవ్ర రక్తగాయాలైన శంకరమ్మను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు.

ప్రమాదంలో

వ్యక్తికి తీవ్ర గాయాలు

మడకశిర రూరల్‌: మండలంలోని జమ్మానపల్లి క్రాస్‌ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో నెల్లూరుకు చెందిన వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై రక్త గాయాలతో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జమ్మానపల్లిలో విద్యుత్‌ స్తంభాలకు తీగలను లాగడానికి కూలి పని కోసం వచ్చినట్లుగా సమాచారం. గురువారం రాత్రి పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై మడకశిరకు వెళుతుండగా వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement