కదిరి: కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కదిరిలో తరచూ ఏదో ఒక విషయంలో వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తన ఇంటిముందున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ తన వాహనాలను కొన్నేళ్లుగా పార్కింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై కదిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భైరవప్రసాద్ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటబెట్టుకొని గురువారం ఆలయ అధికారులను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తక్షణం ఆ స్థలాన్ని ఆలయ అధికారులు స్వాధీనం చేసుకోవాలని, లేదంటే ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
బీజేపీ నేత ఎంఎస్‌పైనా..
ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథిని కూడా జనసేన ఇన్‌చార్జ్ టార్గెట్ చేశారు. ఎంఎస్ పార్థసారథి ఇల్లు తిరువీధుల్లోనే ఉంది. ఆక్రమణలు తొలగిస్తే ఆయన ఇల్లు చాలా వరకూ కొట్టేయాల్సి ఉంటుంది. మురుగు కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడని, ఇలాంటి ఆక్రమణల కారణంగానే మురుగు నీరు తరచుగా ఆలయంలోకి వస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు.
భైరవకు ఎందుకంత కోసం?
జనసేన కదిరి ఇన్‌చార్జ్ భైరవప్రసాద్‌కు ఎమ్మెల్యే కందికుంటతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథిలపై ఎందుకంత కోపంగా ఉన్నారనేది ఇప్పుడు కదిరిలో హాట్ టాపిక్‌గా మారింది. ఖాద్రీశుడి ఆలయ కమిటీ చైర్మన్ పదవి తనకు రాకుండా వారు అడ్డుపడ్డారని, అలాగే ఇటీవల తన భార్యతో గొడవ పడితే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తనపై కేసు నమోదు చేయించారనే బాధ ఆయనలో ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు. మరోవైపు నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డిని తేరుపైకి రాకుండా ఎమ్మెల్యే పోలీసుల ద్వారా హౌస్ అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది.
కదిరి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన
జనసేన ఇన్‌చార్జ్ భైరవ
ఖాద్రీశుడి ఆలయం చుట్టూ
ఆక్రమణలపై ఫిర్యాదు


