‘‘
ప్రతి పల్లెకూ సదుపాయం..
మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికీ సెల్‌ఫోన్ సేవలను విస్తరిస్తున్నట్లు గొప్పగా ప్రకటించిన భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఆచరణలో మాత్రం విఫలమైంది. ఉమ్మడి జిల్లాలోని 38 గ్రామాల్లో 4జీ బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరి 18న ప్రకటన విడుదల కాగా, ఆరు నెలలు కావస్తున్నా... నేటికీ ఒక్కటంటే ఒక్క టవర్ కూడా ఏర్పాటు కాకపోవడమే ఇందుకు నిదర్శనం.
రొళ్ల: మానవ జీవన విధానాన్ని, సమాచార వ్యవస్థను సెల్‌ఫోన్ సమూలంగా మార్చేసింది. తొలి దశలో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితమైన పరికరం.. నేడు అరచేతిలో యావత్ ప్రపంచాన్నే ఇమిడి పోయేలా చేసింది. ఇంటర్నెట్, బ్యాంకింగ్, కెమెరా, వినోదం వంటి సకల సౌకర్యాలను అందించే స్మార్ట్‌ఫోన్‌గా మారింది. వంద గ్రాముల బరువున్న ఈ డబ్బా మానవ జీవితాలపై చూపిస్తున్న ప్రభావం అంతాఇంతా కాదు. ఈ క్రమంలో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ సిమ్ కార్డు ప్రొవైడర్లు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన సేవలను వినియోగదారులకు చేరువ చేసేందుకు పోటీ పడుతుండగా.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం పూర్తిగా చతికిలపడింది. 5జీ సాంకేతిక విప్లవం దుమారం లేపుతున్న ప్రస్తుత రోజుల్లోనూ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను సక్రమంగా అందించలేకపోతోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు
సెల్‌ఫోన్ వినియోగదారులకు సిమ్ కార్డులను బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ప్రైవేట్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వోడా అందుబాటులోకి తెచ్చాయి. రీచార్జ్ ధరలు తక్కువగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపారు. అయితే తరచూ నెట్‌వర్క్ సమస్య తలెత్తడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పలేదు. కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ అందక గ్రామీణులు కొండల పైకి ఎక్కాల్సి వచ్చింది. ఈ క్రమంలో చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ప్రైవేట్ సిమ్ కార్డుల వైపు దృష్టి సారించారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 గ్రామాల్లో 4జీ టవర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరి 18న ప్రకటన విడుదల చేసింది. అయితే దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ కనీసం టవర్ల నిర్మాణానికి అనువైన స్థలాన్ని కూడా గుర్తించలేదు. ఇప్పటికై నా బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు స్పందించి 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని 38 గ్రామాలకు బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్లు మంజూరైనట్లు ప్రకటన
ఆరు నెలలు కావస్తున్నా ఏర్పాటు కాని వైనం
నెట్‌వర్క్ సమస్యతో వినియోగదారులకు తప్పని ఇబ్బందులు
అత్యవసర సమయంలో కొండ గుట్టలను ఆశ్రయిస్తున్న దుస్థితి
ఉత్తర్వులు రాలేదు
రొళ్ల మండల వ్యాప్తంగా నెట్‌వర్క్ సమస్య ఉన్న గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీడీ పల్లి, జీజీ హట్టి, అగ్రహారం, దాసప్పపాళ్యం, పిల్లిగుండ్ల గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే సెల్ టవర్ల ఏర్పాటుకు స్థలం కేటాయించాలంటూ ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఆదేశాలు అందితే వెంటనే స్థలాన్ని గుర్తించి స్వాధీనం చేస్తాం.
– చంద్రశేఖర్,
ఇన్‌చార్జ్ తహసీల్దార్, రొళ్ల మండలం


