బత్తలపల్లి: ఆటో, కారు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తన భార్యను ఆర్డీటీ ఆస్పత్రిలో వదిలి కదిరి రోడ్డు వైపుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళుతుండగా ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామం నుంచి ప్రయాణికుల ఆటో ఢీకొంది. ఘటనలో ఆటో డ్రైవర్ శివయ్య, అందులోని ప్రయాణికులు గంగాదేవి (ఏఎన్‌ఎం), డి.చెర్లోపల్లికి చెందిన లక్ష్మన్న, ఆత్మకూరుకు చెందిన ఓబులమ్మ, కారు నడుపుతున్న ఇంద్రకుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
‘పచ్చ’ కార్యకర్తల అత్యుత్సాహం
ధర్మవరం రూరల్: రోడ్డుకు ఇరువైపులా లేదా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకోవడం ఏ రాజకీయ పార్టీ నాయకులైనా చేస్తుంటారు. అయితే పచ్చపార్టీ కార్యకర్తలు ఏకంగా ఏలుకుంట్ల గ్రామ సచివాలయానికి ఫ్లెక్సీ, తోరణాలు కట్టి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళితే ఎలాంటి స్పందన లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని అంటున్నారు.
విద్యుదాఘాతంతో
వలస కార్మికుడి మృతి
పెనుకొండ రూరల్: విద్యుత్ షాక్‌కు గురై వలస కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పశ్చిమ బెంగాల్‌లోని మదీనాపూర్ జిల్లా సుమిత్ర పూర్ తాలూకా రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాజల్ సింగ్(46) కొంత కాలంగా పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ప్లైఓవర్ నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉధయం సెల్‌ఫోన్‌కి చార్జింగ్ పెట్టే విషయంలో విద్యుత్ వైర్లును ఒక రేకుల షెడ్డు నుంచి మరో షెడ్డుకు మార్చే క్రమంలో షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన తోటి కార్మికులు వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి అన్న బాబ్రీసింగ్ ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు కియా పీఎస్ ఎస్‌ఐ డి.రాఘవయ్య తెలిపారు.


