పుట్టపర్తి అర్బన్: కొండలు, పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న జిల్లాలో పర్యాటకుల సందడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారి రాకపోకలతో రైళ్లు, బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల్లో సీటు దొరకడం కష్టమని భావించిన పలువురు కాస్త ఆలస్యమైనా పర్వాలేదని రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
తగ్గిన ఎండ ప్రభావం
కొన్ని రోజుల క్రితం వరకూ ఎండలు తీవ్ర ప్రభావం చూపడంతో పర్యాటకులు రాకపోకలు తగ్గాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎండ ప్రభావం తగ్గింది. దీంతో వృద్ధులు, చంటి పిల్లలతో సహా ఇంటిల్లి పాది బస్సులు, రైళ్లతో పాటు సొంత వాహనాల్లో జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను చుట్టి వస్తున్నారు.
పుంజుకున్న వ్యాపారాలు
జిల్లాలోని పెనుకొండ కోట, లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తి, ప్రసిద్ధిగాంచిన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తిమ్మమ్మ మర్రిమాను, హేమావతి తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రతో పాటు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు చెందిన సత్యసాయి భక్తులు పెద్ద సంఖ్యలో పర్తి యాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకుంటున్నారు. వీరందరూ రైలు మార్గం ద్వారానే ప్రయాణిస్తుండడంతో ఆయా మార్గాల్లోని రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. పర్యాటకుల సందడితో పుట్టపర్తిలో వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి.
జిల్లాలో పెరిగిన పర్యాటకుల సందడి
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సులు


