● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్
హిందూపురం: ఉచిత న్యాయ సేవలు సద్వినియోగం చేసుకోవాలని రిమాండ్ ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎన్‌ఎస్‌ఏ) కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. బుధవారం హిందూపురంలోని సబ్‌జైలును న్యాయమూర్తి తనిఖీ చేశారు. పలు రికార్డులు, బ్యారక్‌లను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి తెల్లరేషన్ కార్డు కలిగిన రిమాండ్ ఖైదీలు కోర్టులో వాదనలు వినిపించేందుకు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకునేందుకు డీఎల్‌ఎస్‌ఏకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి 24 గంటల్లోపు అనుమతులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా వివక్ష ప్రదర్శిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సబ్‌జైలర్ హనుమప్ప, న్యాయవాదులు నవేరా, జగదీష్, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, రాజా తదితరులు పాల్గొన్నారు.
‘అనంత’ అతలాకుతలం
అనంతపురం అగ్రికల్చర్: భారీ వర్షాలు అనంతపురం జిల్లాను అతలాకుతలం చేశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. 17 మండలాల పరిధిలో 16.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 78 మి.మీ, బుక్కరాయసముద్రంలో 65 మి.మీ భారీ వర్షం కురిసింది. అనంతపురం అర్బన్ 56.2 మి.మీ, కణేకల్లు 52, అనంతపురం రూరల్ 48.6, రాయదుర్గం 42.6, రాప్తాడు 38.8, బెళుగుప్ప 33.6, కుందుర్పి 22.6, కళ్యాణదుర్గం 17.4, గుమ్మఘట్ట 10 మి.మీతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మే నెల సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 51.2 మి.మీ నమోదైంది. భారీ వర్షాలు కురిసిన మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ప్రవహించాయి. 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు అనంతపురం, బుక్కరాయసముద్రం, శింగనమల, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం, రాప్తాడు, కళ్యాణదుర్గం, ఆత్మకూరు తదితర మండలాల్లో 200 హెక్టార్లలో అరటి, మామిడి, బీర, టమాట తదితర పంటలు దెబ్బతిన్నాయి. రూ.4కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.


