ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే.. కార్డు రద్దు! | - | Sakshi
Sakshi News home page

ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే.. కార్డు రద్దు!

May 28 2026 12:16 AM | Updated on May 28 2026 12:16 AM

ప్రశాంతి నిలయం: రేషన్‌ కార్డుదారులు జూన్‌ 2వ తేదీలోపు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని, లేకపోతే కార్డులు రద్దు చేస్తామని జేసీ మౌర్య భరద్వాజ్‌ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... అధికారులు కార్డుదారుల ఈ–కేవైసీ పూర్తి చేయడాన్ని ప్రాధాన్యతా అంశంగా తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులను గడువులోపు పరిశీలించి పూర్తి చేయాలని సీఎస్‌డీటీలను ఆదేశించారు. గ్యాస్‌ డెలివరీ, రేషన్‌ పంపిణీ, అక్రమ రవాణా, పెట్రోలు బంకులు, గ్యాస్‌ ఏజెన్సీల తనిఖీ నిరంతరం కొనసాగాలన్నారు. అనంతరం హాస్టళ్లలో వసతులు, ఐసీడీఎస్‌ పరిధిలోని వివిధ పథకాల అమలు, ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు, మధ్యాహ్న భోజనం అమలుపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సత్యసాయి సన్నిధిలో

సినీ నటులు

ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా మహా సమాధి దర్శనార్థం సినీ నటులు రాధిక, శరత్‌కుమార్‌ బుధవారం సాయంత్రం పుట్టపర్తికి విచ్చేశారు. రోడ్డు మార్గంలో వచ్చిన వారు నేరుగా శాంతి భవన్‌ చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం దర్శన వేళల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా వారికి ట్రస్ట్‌ సభ్యులు స్వాగతం పలికారు.

‘పసుపు’ పండుగలో

ప్రభుత్వ ఉద్యోగులు

టీడీపీ కార్యకర్తలతో కలిసి

కూడేరు సీఐ హల్‌చల్‌

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: తెలుగుదేశం పార్టీ ‘పసుపు పండుగ’ మహానాడులో ప్రభుత్వ ఉద్యోగులు తరించారు. బుధవారం కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో నాయకులు, కార్యకర్తల మధ్యలో సీఐ రాజు ఆశీనులయ్యారు. అంతేకాదు సెల్ఫీలు దిగి.. కేకులు కట్‌ చేశారు. దీంతో ఖాకీ ముసుగులోని ‘పసుపు రంగు’ను ప్రదర్శించినట్లయ్యింది. గతంలో కూడేరు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చడం విమర్శలకు దారి తీసింది. అప్పట్లో సీఐ తీరును ఎండగడుతూ అనంతపురంలో ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా నిర్వహించింది. అయినా సీఐ తన పద్ధతి ఏమాత్రమూ మార్చుకోకుండా మహానాడులో ‘పసుపు’ కార్యకర్తల భుజాలపై చేతులు వేసుకుని హల్‌చల్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పసుపు జెండాలు కట్టిన ‘పంచాయతీ’

ఉరవకొండలోని దేవాంగ కల్యాణ మండపం, టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడు ఏర్పాట్లలో పంచాయతీ సిబ్బంది పాలుపంచుకున్నారు. ఆవరణమంతా టీడీపీ జెండాలు కట్టారు. పంచాయతీ మేసీ్త్రలు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వ జీతం తీసుకుని పంచాయతీ పరిధిలో విధులు నిర్వర్తించకుండా రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement