పుట్టపర్తి: ‘ఏరుదాటేదాకా ఓడ మల్లన్న.. దాటాక బోడిమల్లన్న’ అన్నట్లుంది హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం ఎమ్మెల్యేల తీరు. ఎన్నికల ముందు ఏవేవో చెప్పిన వారు నేడు ప్రజలకు అసలు అందుబాటులోనే ఉండడం లేదు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్‌లో ఉంటూ సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలియడం లేదు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం, అమరావతిలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర అనంతపురంలో ఉంటూ అప్పుడప్పుడూ తన మామ వెంట పుట్టపర్తికి వస్తూ వెళ్తున్నారు. పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన సవిత అమరావతి, హైదరాబాద్, బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. కదిరి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నా ఉపయోగం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో వారి పీఏలు స్థానికంగా అధికారం చెలాయిస్తూ ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యకూ డబ్బుతో ముడిపెట్టి అందినంత లాగేస్తున్నట్లు తెలిసింది.
పట్టించుకునే నాథుడే లేడు..
జిల్లావ్యాప్తంగా సమస్యలు తాండవం చేస్తున్నాయి. రైతుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. చలానా కట్టి నెలలు గడిచినా విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం చేనేత సబ్సిడీలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు నిరాశనిస్పృహల్లో కూరుకుపోయారు. తాగునీటి ఎద్దటి తీవ్రతరం కావడంతో గ్రామీణులు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దిక్కుతోచని స్థితిలో..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు అండగా నిలిచి రూపాయి ఖర్చు లేకుండా సమస్యలను చక్కబెట్టేవారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, సర్టిఫికెట్లు ఇళ్ల వద్దకే తీసుకొచ్చి అందజేసేవారు. అర్హులైతే చాలు పథకాల లబ్ధి చేకూర్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి తలకిందులు కావడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.
చుట్టపుచూపుతో సరి
ప్రజల బాధలు పట్టని ఎమ్మెల్యేలు
ఎన్నికల సమయంలో
అలవిగాని హామీలు
గెలిచాక పంగనామాలు
కష్టాలు కొని తెచ్చుకున్నామని ప్రజల ఆగ్రహావేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి
చెబుతామంటూ హెచ్చరికలు
5 సంవత్సరాల పాటు తమ బాగోగులు చూసుకుంటారని, ఏ సమస్య వచ్చినా తీరుస్తారని నమ్మితే నట్టేట ముంచారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పంగనామాలు పెట్టారు. చుట్టపుచూపుగా వస్తూ పోతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే సూపర్ సిక్స్ పథకాలు, గిట్టుబాటు ధరలు, సబ్సిడీలు, పంట నష్ట పరిహారాలపై నిలదీస్తారనే భయంతోనే జంకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికేతరులకు పట్టం కట్టిన పాపానికి కష్టాలు కొని
తెచ్చుకున్నట్లయిందని జిల్లా ప్రజలు
ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకేనా గెలిపించింది..?
తమ పార్టీ కార్యకర్తల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, జాతర్లు, ఆలయాల్లో పూజలు, విగ్రహ ప్రతిష్టలకు ఎమ్మెల్యేలు అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. అనుకోకుండా నియోజకవర్గాల్లో ఏవైనా సభలు, సమావేశాలు నిర్వహిస్తే హామీలపై మాట్లాడకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ ఆనందం పొందుతున్నారు. నెలకోసారి ఆర్భాటంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నా వాటిలో 10 శాతం కూడా పరిష్కారం కావడం లేదు. ఎవరైనా తమకు సంక్షేమ పథకాలు అందలేదు.. సమస్యలు వినండి అంటే వారిపై దాడులు చేయించడం, అధికార బలంతో కక్ష సాధింపులకు దిగుతుండడంతో ఇందుకేనా గెలిపించింది అంటూ ప్రజలు మండిపడుతున్నారు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.


