అమ్మా.. అంతా క్షేమమేనా! | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. అంతా క్షేమమేనా!

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

మహిళలతో ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆరా

ధర్మవరంలో పలు కాలనీల్లో పర్యటన

ధర్మవరం అర్బన్‌: ‘అమ్మా క్షేమంగా ఉన్నారా.. మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలున్నాయా.. ఎవరైనా వేధిస్తున్నారా.. రాత్రివేళ మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారు ఉన్నారా... ఎలాంటి భయం లేకుండా పోలీసులకు సమాచారం ఇస్తే మీకు రక్షణగా మేముంటాం’ అంటూ ఎస్పీ సతీష్‌కుమార్‌ భరోసానిచ్చారు. మంగళవారం ధర్మవరంలోని తిక్కస్వామినగర్‌, శివానగర్‌, నేసేపేట, మాధవనగర్‌, దర్గాసర్కిల్‌, లోనికోట, చెరువుకట్ట, లక్ష్మీచెన్నకేశవపురం, మహాత్మాగాంధీ కాలనీల్లో ఎస్పీ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. మహిళల భద్రత, సంఘ విద్రోహ కార్యకలా పాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, యువతపై ప్రభావం చూపుతున్న పరిస్థితులు, ప్రజా భద్రత అంశాలపై ఎస్పీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహహింస, ఈవ్‌ టీజింగ్‌, బెదిరింపులు తదితర సమస్యలను ఆలస్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రశాంతతకు భంగం కలిగించే సంఘ విద్రోహశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళలు, బాలికలకు భరోసా కల్పించేలా ఫీల్డ్‌ విజిట్స్‌ను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం ధర్మవరం చెరువును ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో వన్‌ టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌, టూ టౌన్‌ సీఐ రెడ్డెప్ప, ఎస్‌ఐలు ఉమాదేవి, వీరేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement