ఉమ్మడి పాసుబుక్కు.. ఇదేమి చిక్కు? | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి పాసుబుక్కు.. ఇదేమి చిక్కు?

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

● ఉమ్మడి పాసుపుస్తకంలో కనబరచిన రైతుల్లో ఏ ఒక్కరు సంతకం చేయకపోయినా, అభ్యంతరాలు తెలిపినా పీఎం కిసాన్‌ లేదంటే అన్నదాత సుభీభవ పథకం డబ్బులు పొందడం కష్టమవుతుంది. ● రైతులు తమ పంట రుణాల రెన్యూవల్‌ కోసం బ్యాంకుకెళితే ఉమ్మడి పాసుపుస్తకాన్ని చూసి బ్యాంకర్లు రెన్యూవల్‌ చే సేందుకు నిరాకరిస్తున్నారు. ● ఉమ్మడి ఖాతాలోని భూమిని విక్రయించాలన్నా లేదా తనఖా పెట్టాలన్నా ఉమ్మడి పాసుపుస్తకంలో ఉన్న సభ్యులందరూ వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. ఏ ఒక్కరు రాకపోయినా ఇబ్బందే. ●ఉమ్మడి పాస్‌బుక్‌ కారణంగా కుటుంబ సభ్యులు, దాయాదులు, బంధువుల మధ్య ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు పెరిగిపోతున్నాయి. ● పూర్వపు భూ రికార్డులకు, కొత్త పాసుపుస్తకాల్లో ఉన్న ఆస్తి వివరాలకు తేడాలు కనబడుతున్నాయి. రైతుల పేర్లతో పాటు విస్తీర్ణంలో కూడా తప్పులు దొర్లాయి. ● ఉమ్మడి ఎల్‌పీఎం నంబర్లు జారీ చేయడంతో తమ భూమి హద్దులు తెలుసుకోవడం కష్టంగా ఉంది. భూమి సాగు చేద్దామని వెళితే ఇప్పుడు ఆ భూమి తనదని అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ●ఒక రైతు ఒకేచోట ఉమ్మడిగా ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవాలంటే కొత్త ఎల్‌పీఎం/సర్వే నెంబర్లు సరిగ్గా అనుసంధానం కాకపోవడంతో మ్యూటేషన్‌ జరగడం లేదు. దీంతో అవసరానికి భూమి అమ్ముకోలేని పరిస్థితి ఉంది..ఇలా ఉమ్మడి ఎల్‌పీఎంతో రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కదిరి: రైతుల పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు.. ‘తాంబూలాలిచ్చేశాం..తన్నుకు చావండి’ అన్న చందంగా ఉంది. ప్రతి గ్రామంలో ఒక సర్వే నంబర్‌ పరిధిలో ఎంతమంది రైతులుంటే వారందరికీ కలిపి ఉమ్మడి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడంతో బాధలు వర్ణనాతీతం. వాటిని చూసి రైతులు అవాక్కవుతున్నారు. 10, 20 మంది రైతుల భూముల వివరాలన్నీ అందులో కనబరచడంతో తమకు సంబందించిన భూముల వివరాలు ఎక్కడున్నాయో.. తమకు ఎంత భూమి ఉందోకూడా తెలుసుకోవడం కష్టంగా మారింది. ఉమ్మడి ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌)తో రైతులు భూములు అమ్ముకోవడానికి, కొనడానికి లేదా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, దాయాదుల మధ్య ఏకాభిప్రాయం లేని చాలా చోట్ల వ్యవసాయం, ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు గొడవలు పడాల్సి వస్తోంది.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్ని..

దాయాదులందరికీ ఒకే పాసుబుక్‌ మంజూరు

గొడవలకు దారి తీస్తున్న చంద్రన్న సర్కారు తీరు

పంట రుణాల రెన్యూవల్‌కు రైతుల ఇబ్బందులు

సచివాలయంలో సంప్రదించాలి

జాయింట్‌ ఎల్‌పీఎంలు వేరు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లి నిర్దేశించిన డబ్బు చెల్లిస్తే సంబంధిత సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎల్‌పీఎం సమస్య పరిష్కరిస్తారు. తర్వాత క్రయ,విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌ సమస్యలు ఉండవు.

– మౌర్య భరధ్వాజ్‌, జేసీ

ఏ ఊరికెళ్లినా అదే మాట

పట్టాదారు పాసుపుస్తకంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మను చూసి జీర్ణించుకోలేక చంద్రబాబు ప్రభుత్వం వాటి స్థానంలో కొత్త పాసుబుక్కులిచ్చింది. అందులో ఎవరి భూమి ఎంత ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. వాటిని బ్యాంకు రుణాల రెన్యూవల్‌కు తీసుకెళ్తే బ్యాంకర్లు ఒప్పుకోవడం లేదు.

–రైతు శ్రీధర్‌రెడ్డి, నల్లచెరువు

Advertisement
 
Advertisement
Advertisement