ఆగని ఇసుక అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

ఆగని ఇసుక అక్రమ రవాణా

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

పరిగి: మండలంలో ఇసుక అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. స్థానిక అవసరాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ప్రభుత్వాదాయానికి అక్రమార్కులు గండికొడుతున్నారు. పరిగి, శ్రీరంగరాజుపల్లి, శాసనకోట, నేతులపల్లి, బాలిరెడ్డిపల్లి, పైడేటి, గణపతిపల్లి, పైడేటి, ఊటుకూరు తదితర ప్రాంతాల్లోని పెన్నా, జయమంగళి నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయమే మోదా పంచాయతీ గ్రామ శివారులో ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఉచితం మాటున ఇలా అక్రమార్జనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విద్యుదాఘాతంతో

డ్రైవర్‌ మృతి

పెనుకొండ రూరల్‌: పని ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌ గురై ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ కొండంపల్లికి చెందిన వేణుగోపాలరెడ్డి (45)కి భార్య, అనిత, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వేణుగోపాలరెడ్డి మంగళవారం ఓ రైతు పొలంలోకి ఎరువును తోలెందుకు వెళ్లాడు. పొలంలో ఎరువును అన్‌లోడ్‌ చేసే క్రమంలో ట్రాలీ పైకెత్తడంతో పైనున్న విద్యుత్‌ తీగలు తగలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

పెనుకొండ రూరల్‌: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కియా పీఎస్‌ ఎస్‌ఐ డి.రాఘవయ్య తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం అనంతపురం నుంచి బెంగళూరుకు 15 టన్నుల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్‌ వాహనాన్ని పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. ధాన్యం తరలింపులకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో డ్రైవర్‌ ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీ ప్రభావతికి అప్పగించారు.

పోలీసునని బెదిరించి.. విద్యార్థినిపై అత్యాచారయత్నం

అనంతపురం సెంట్రల్‌: నగర శివారులోని టీవీ టవర్‌ సమీపంలో ఉన్న వనమిత్ర పార్కులో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం యత్నం ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రూరల్‌ పరిధిలోని ఓ ఫార్మసీ కళాశాలలో చదువుతున్న యువతి, యువకుడు సోమవారం అటవీశాఖకు చెందిన వనమిత్రపార్క్‌కు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వారిని నిలువరిస్తూ తాను పోలీసునని, స్టేషన్‌కు పదండి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇస్తామంటూ దబాయించాడు. దీంతో తాము విద్యార్థులమని వారు చెప్పుకొచ్చినా వినకుండా యువతితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఒకానొక సమయంలో యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో యువకుడు గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి సదరు వ్యక్తి జారుకున్నాడు. ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కాగా, యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అనంతపురానికి చెందిన హరిగా పోలీసులు గుర్తించారు. వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

స్వర్ణకారుడి ఇంట్లో చోరీ

గుంతకల్లు టౌన్‌: స్థానిక భాగ్యనగర్‌లో నివాసముంటున్న జ్యువెలరీ షాప్‌ నిర్వాహకుడు ఎం.ఖాదర్‌బాషా ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో దాచిన 7.5 తులాల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... ఖాదర్‌బాషా చిన్నమ్మ ఫాతిమాబీ 10 రోజుల క్రితం తన బంధువుల ఊరికి వెళ్తూ తనకు సంబంధించిన 7.5 తులాల బంగారు నగలను బీరువాలో భద్రపరచాలని ఖాదర్‌బాషాకు అప్పగించి వెళ్లారు. ఈ నెల 23న తిరిగి వచ్చిన ఆమెకు నగలు ఇచ్చేందుకు బీరువా తెరిచి చూడగా కనిపించలేదు. ఆందోళనకు గురైన ఖాదర్‌బాషా కుటుంబసభ్యులను ఆరాతీసినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ మనోహర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement