భక్తుల ఇలవేల్పు సప్తమాత్రుక అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

భక్తుల ఇలవేల్పు సప్తమాత్రుక అమ్మవారు

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

పరిగి: మండల కేంద్రంలో వెలసిన పురాతన ఆలయం సప్తమాత్రుక అమ్మవారి (పన్నాడమ్మ) ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ఇక్కడి ప్రజలు కొలుస్తుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయానికి మండలంలోనే కాకుండా కర్ణాటక ప్రాంతంలోను పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో జాతర నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

11 ఏళ్ల తర్వాత ఉత్సవం

పరిగి చెరువు కట్ట కింద వెలసిన సప్తమాత్రుకాదేవి ఆలయంలో సాధారణ నిత్య పూజలే కాకుండా కార్తీక మాస పూజలు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ప్రతి ఐదేళ్లకోసారి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా గత పదకొండేళ్లుగా ఉత్సవాలకు బ్రేక్‌ పడింది. పరిగి చెరువులో నీరుండడమే ఇందుకు కారణం. చెరువులో నీరుంటే అమ్మవారికి జాతర నిర్వహించరని ఆలయ కమిటీ సభ్యులు. ఈ క్రమంలో ఇటీవల చెరువు ఖాళీ కావడంతో జాతరను నిర్వహించేందుకు సన్నద్ధమయినట్లు పేర్కొన్నారు.

దాసన్నకు ఇచ్చిన హామీకి కట్టుబడి...

మహిమాన్వితురాలిగా పేరుగాంచిన సప్తమాత్రుక అమ్మవారు పరిగిలో వెలిసేందుకు ఓ పురాణగాథ నేటికీ ప్రాచుర్యంలో ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం పరిగి చెరువు వర్షాలతో నిండిపోయింది. ఆ సమయంలో కట్ట తెగిపోయే పరిస్థితి ఉండడంతో గ్రామానికి చెందిన దాసన్న అనే నీరుగంటికి అమ్మవారు కలలో కనిపించి చెరువు కట్ట కింద ఉన్న పద్నాలుగు గ్రామాల ప్రజలు తమ సొంతూళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని చాటింపు వేసి రావాలని ఆదేశాలిచ్చింది. అయితే తాను చాటింపు వేసి వచ్చే లోపు గ్రామాలన్నీ జలమయం కాకుండా తనకు రక్షణ కల్పించాలని దాసన్న కోరడంతో అమ్మవారు అందుకు సమ్మతించారు. చాటింపు వేసి తిరిగి పరిగికి వచ్చే వరకూ తాను చెరువు కట్ట తెగకుండా రక్షణ కల్పిస్తానని భరోసానిచ్చారు. దీంతో అతను గ్రామగ్రామాన చాటింపు వేస్తూ చివరగా ఓ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ చాటింపు అనంతరం అమ్మవారు ఇచ్చిన మాటను గ్రహించిన స్థానికులు దాసన్న వెనుదిరిగి వెళితే చెరువు కట్ట తెగిపోతుందని, అతను ఎన్నటికీ పరిగికి వెళ్లకూడదని నిర్ణయించుకుని చంపేశారు. అప్పటి నుంచి దాసన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి నేటికీ చెరువు కట్ట తెగకుండా అమ్మవారు కాపాడుతూ వస్తోందని భక్తులు విశ్వసిస్తున్నారు.

నేటి నుంచి ఉత్సవాలు

ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకూ సప్తమాత్రుక అమ్మవారి ఆలయంలో జాతరను నిర్వహించనున్నారు. 27న అంకురార్ఫణ, ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభమవుతాయి. 28న విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. 29న కలశ ప్రతిష్ఠాపన, చండీయాగం, దీపోత్సవం, గ్రామోత్సవంతో వేడుకలు ముగుస్తాయి.

కొంగు బంగారమై విరాజిల్లుతున్న పన్నాడమ్మ ఆలయం

నేటి నుంచి మూడ్రోజుల పాటు జాతర

Advertisement
 
Advertisement
Advertisement