వ్యక్తి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి బలవన్మరణం

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

పుట్టపర్తి అర్బన్‌: స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్‌ సమాచారంతో హిందూపురం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం–బెంగళూరు ప్యాసింజర్‌ రైలు కింద పడి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న అతన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతుడిని కొత్తచెరువుకు చెందిన బద్వేలు అర్షాద్‌ 928)గా గుర్తించారు. మూడేళ్ల క్రితం ఓ యువతితో వివాహం కాగా, రెండేళ్ల క్రితం మతపరమైన విడాకులు పొందాడు. అప్పటి నుంచి మతి స్థిమితం లేక బాధపడుతుంటే కుటుంబసభ్యులు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్షాద్‌ నేరుగా పుట్టపర్తి రైల్వే స్టేషన్‌ సమీపంలోకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

ల్యాప్‌టాప్‌ దొంగ అరెస్ట్‌

ధర్మవరం అర్బన్‌: స్థానిక శివానగర్‌ సచివాలయంలో ల్యాప్‌టాప్‌ను అపహరించిన దొంగను అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. వివరాలను మంగళవారం రాత్రి ఆయన వెల్లడించారు. సచివాలయం పరిధిలో నివాసముంటున్న ఓ మైనర్‌ బాలుడు ఆదివారం రాత్రి సచివాలయం తాళాన్ని ఇనుప రాడ్‌తో బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించాడు. అనంతరం ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ను అపహరించి, ఇంటికి చేరుకున్న తర్వాత వేలి ముద్రల ఆధారంగా తనను పోలీసులు గుర్తిస్తారనే భయంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ద్విచక్ర వాహనంలోని పెట్రోల్‌ తీసుకెళ్లి సచివాలయంలో తాను తాకిన ప్రాంతాల్లో పోసి నిప్పుపెట్టాడు.సీసీ కెమెరా ఫుటేజీలు, పక్కా సమాచారంతో మంగళవారం ఎర్రగుంట సర్కిల్‌లో మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకుని, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

లారీ ఢీ – రైతు మృతి

గార్లదిన్నె: మండలంలోని ఎగువపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై లారీ ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన రైతు పెద్ద ఓబయ్య (80) మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జాతీయ రహదారికి అవతలి వైపు ఉన్న తన పొలానికి రోజూ కాలి నడకన వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలానికి వెళ్లిన ఓబయ్య... అక్కడ పని ముగించుకుని ఇంటికి వెళుతూ.. జాతీయ రహదారిపై రైస్‌ మిల్లు వద్ద రోడ్డు దాటుతుండగా గుత్తి వైపుగా వెళుతున్న హర్యానాకు చెందిన లారీ ఢీకొంది. పెద్ద ఓబయ్యకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు 108 ద్వారా అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ ఆచూకీ కోసం గాలిస్తుండగా కాశేపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఆపి డ్రైవర్‌ పరారైనట్లుగా గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement