● ‘పరిష్కార వేదిక’కు 336 అర్జీలు
ప్రశాంతి నిలయం: ఒకే సమస్య.. అర్జీ ఇవ్వడం.. అధికారులు ఆన్‌లైన్‌లో మాత్రం పరిష్కారం చూపడం.. దీంతో బాధితులు మళ్లీ అదే సమస్యపై అర్జీలు పట్టుకుని కలెక్టరేట్‌కు రావడం మామూలై పోయింది. అందుకే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ పేరుతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో సమస్యల పరిష్కారించిన అర్జీల సంఖ్య మాత్రం వేలల్లో ఉంటున్నాయి. తాజాగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లోనూ అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు 336 అర్జీలు అందజేశారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ కొండయ్య తదితరులు అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎప్పటిలాగే వాటిని ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమవేశమై అర్జీల పరిష్కారంపై దిశా నిర్దేశం చేశారు. ‘పరిష్కార వేదిక’ ద్వారా అందే అర్జీలను నాణ్యతతో పరిష్కరించి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి సమస్యనూ పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, రీఓపెనింగ్, గడువు దాటకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు.
కదిరి ఆర్డీఓగా కళావతి
కదిరి: నూతన ఆర్డీఓగా కళావతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఆమె ఒంగోలులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించిన భూసేకరణ వ్యవహారాలు చూస్తున్నారు. కళావతి గతంతో కదిరి ప్రాంతంలో పలు మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. కాగా, ప్రస్తుతం కదిరిలో ఆర్డీఓగా ఉన్న వీవీఎస్ శర్మకు బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
30న జెడ్పీ
స్థాయీ సంఘాల సమావేశం
అనంతపురం టవర్‌క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 30న స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమావేశ భవన్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.
గ్యాస్ మిత్ర యాప్‌ను రూపొందించిన బాలుడు
అనంతపురం: గోరంట్లకు చెందిన శ్రీధర్, చందన దంపతుల కుమారుడు, 14 ఏళ్ల గంధం ధీరజ్.. పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే 8వ తరగతి అభ్యసిస్తూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో గ్యాస్ మిత్ర యాప్‌కు రూపకల్పన చేశాడు. సామాన్య ప్రజల్లో ఎల్‌పీజీ భద్రత, పొదుపు, సైబర్ మోసాలపై అవగాహన పెంపొందించేలా ఈ యాప్‌ను రూపొందించడం గమనార్హం. ఎల్‌పీజీ బుకింగ్ అర్హత కాలిక్యులేటర్, గ్యాస్ లీకేజీపై భద్రత సూచనలు, గ్యాస్ పొదుపు చిట్కాలు, డీఏసీ మోసాలపై 12 భారతీయ భాషలకు వాయిస్ సపోర్ట్ చేసేలా అందుబాటులోకి తెచ్చారు. యాప్ రూపకర్త ధీరజ్‌ను సోమవారం జేఎన్‌టీయూ (ఏ)లోని రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కార్యాలయంలో సీఈఓ డాక్టర్ ఆర్.హఫీజ్ బాషా అభినందించారు.
పరిష్కార వేదికకు
85 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 85 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకితా సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


