కబ్జా స్థలం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కబ్జా స్థలం పరిశీలన

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

కదిరి: స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా కూటమి నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని సోమవారం కదిరి ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ, తహసీల్దార్‌ రెడ్డిశేఖర్‌తో పాటు సర్వేయర్లు పరిశీలించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన కూటమి నేతలు ప్లాట్లు వేసి అమ్మకానికి సిద్ధం చేస్తున్న వైనంపై ‘దర్జాగా కబ్జా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ స్పందించారు. కదిరి ఆర్డీఓకు ఫోన్‌ చేసి భూకబ్జాలపై ఆరా తీశారు. ‘సాక్షి’లో ప్రచురించిన సర్వే నం.1782–1లోని 99 సెంట్లు, 1782–2లో ఉన్న 33 సెంట్లతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయో పరిశీలించి సమగ్ర నివేదిక పంపాలని ఆర్డీఓను ఆదేశించారు. అలాగే ఆయా స్థలాల్లో మొక్కలు నాటాలని, లేదంటే కంచె వేయాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కబ్జా స్థలాల పరిశీలన కోసం కొందరు రెవెన్యూ అధికారులతో ఓ కమిటీని వేసి, స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని ఆర్డీఓ తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురించి వార్త వాస్తమని, అక్కడ కొందరు పునాదులు కూడా వేసుకున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు.

బాధితుల గగ్గోలు..

కూటమి నేతల నుంచి ఇప్పటికే భూములు కొన్న వారు అది ప్రభుత్వ భూమి అని తెలిసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం వారు సదరు స్థలం వద్దకు వచ్చి తాము ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి మోసపోయామని న్యాయం చేయాలని ఆర్డీఓను వేడుకున్నారు. అయితే ప్రభుత్వ స్థలాన్ని అమ్మడానికి వారికి ఎలాంటి హక్కులు లేవని, ఇలాంటి స్థలాలు కొనుగోలు చేసినా తప్పేనని, ఈ విషయంలో తానేమీ చేయలేనని ఆర్డీఓ వారికి తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిపై కేసులు కూడా పెడతామని ఆర్డీఓ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement