ప్రారంభమైన ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాలు ఏర్పాటు చేయగా... తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్‌ విద్యార్థులు 1,985 మంది హాజరుకావాల్సి ఉండగా 1,574 మంది హాజరయ్యారని, 411 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కిష్టప్ప తెలిపారు. అలాగే ఏపీఓఎస్‌ఎస్‌ విద్యార్థులు 147 మందికి గాను 110 మంది హాజరు కాగా, మరో 37 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొత్తంగా తొలిరోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 448 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు డీఈఓ తెలిపారు.

185 మంది గైర్హాజరు..

జిల్లాలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నాల్గో రోజు సోమవారం 32 కేంద్రాల్లో జనరల్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌, సివిక్స్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు పేపర్‌–2 పరీక్ష నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 185 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్‌ పేర్కొన్నారు. ఉదయం ప్రథమ సంవత్సరానికి సంబంధించి 2,688 మందికి గాను 2,580 మంది హాజరు కాగా, 108 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష 1,334 మందికు గాను 1,257 మంది విద్యార్థులు హాజరు కాగా, 77 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు.

28న జరగాల్సిన పరీక్ష వాయిదా..

ఈనెల 28న జరగాల్సిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను బక్రీద్‌ పండుగ సందర్భంగా వాయిదా వేసినట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్‌ తెలిపారు. ఈ పరీక్షలను జూన్‌ 5వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక జూన్‌ 5వ తేదీన జరగాల్సిన ‘నైతికత, మానవ విలువలు’ పరీక్షను జూన్‌ 12వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement