రొళ్ల: మండల కేంద్రంలోని చెరువుకు ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న సప్లై ఛానల్ పూర్తిగా ముళ్ల పొదలు, మట్టితో పూడుకుపోయింది. హొట్టేబెట్ట పంచాయతీ పరిధిలోని హొట్టేబెట్ట, కల్లురొప్పం, గొల్లహట్టి, కొత్తపాళ్యం, కొత్తపాళ్యం తండా, కొడగార్లగుట్ట కాలనీ సమీపంలోని బసవన్నకొండ ప్రాంతం, కొడగార్లగుట్ట గ్రామాలు అనుకుని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని వృథా కానివ్వకుండా రొళ్ల చెరువుకు మళ్లించేలా 1996లో రూ.5 లక్షల వ్యయంతో సప్లై ఛానల్‌ను నిర్మించారు. ఛానల్ నిర్మాణం పూర్తయిన కొత్తలో రొళ్ల చెరువుకు సమృద్ధిగా నీరు అందేది. ప్రస్తుతం 14 ఏళ్లుగా ఈ ఛానల్ ద్వారా చుక్క నీరు అందకుండా పోయింది.
కర్ణాటక వైపుగా మళ్లిన వరద
రొళ్ల చెరువు నిండితే వందలాది ఎకరాల ఆయకట్టుతో పాటు ఆగళి మండలంలోని దొక్కలపల్లి, బీరనపల్లి, హళ్లికెర, ముత్తేపల్లి తదితర గ్రామాల్లోనూ భోరు బావుల్లో నీటి మట్టం పెరిగి వందల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చేవి. భూగర్భజలాలు పెరిగి రెండు మూడేళ్ల పాటు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే సప్లై ఛానల్‌లో మట్టి పెళ్లలు విరిగి పడి, పిచ్చి మొక్కలు పెరగడంతో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. వర్షపు నీరంతా దిగువన ఉన్న కర్ణాటక ప్రాంతానికి మళ్లిపోతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక వైపుగా వెళుతున్న నీటికి అడ్డు వేసేందుకు అప్పట్లో చెక్‌డ్యాంను నిర్మించారు. అయితే ఈ చెక్‌డ్యాం ఎత్తు పెంచకపోవడంతో ఇది కూడా నిరుపయోగంగా మారింది. ఇటీవల సుమారు రూ.7 లక్షల వ్యయంతో సప్లై ఛానల్‌లో పూడిక, పిచ్చి మొక్కలను ఆర్డీటీ తొలగించింది. ఆ తర్వాత కురిసిన వర్షాలకు మళ్లీ మట్టి పెళ్లలు విరిగి పడి ఛానల్ మూసుకుపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి పోయాయి.
కొడగార్లగుట్ట వద్ద పూడిపోయిన సప్లై ఛానల్
రొళ్ల మండలం కొడగార్లగుట్ట వద్ద మట్టి, పిచ్చి మొక్కలతోనిండిన సప్లై ఛానల్
14 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని సప్లై ఛానల్
వృథా అవుతున్న వర్షపు నీరు
చెక్‌డ్యాం ఎత్తు పెంచాలి
చెరువులకు నీటిని అందించే సప్లై ఛానల్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూడికతో నిండిపోయింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా జనధార–జల హారతి కార్యక్రమం కింద అభివృద్ధి చేసే అవకాశమున్నా.. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా రొళ్ల చెరువుకు నీరందకుండా పోతోంది.
రొళ్ల చెరువు నిండితే అగళి మండలంలోని దొక్కలపల్లి, భీరనపల్లి, ముత్తేపల్లి చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి పంటల సాగుకు నీటి కొరత లేకుండా ఉండేది. కొడగార్లగుట్ట గ్రామం వద్ద సప్లై ఛానల్ పూర్తిగా పూడుకుపోయింది. దీంతో అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు వృథాగా కర్ణాటక వైపుగా పోతున్నాయి. అధికారులు స్పందించి సప్లై ఛానల్ మరమ్మతుకు చర్యలు తీసుకోవాలి.
– దేవరాజు, రైతు, దొక్కలపల్లి, అగళి మండలం
కొడగార్లగుట్ట సమీపంలోని సప్లై ఛానల్ వద్ద ఉన్న చెక్‌డ్యాం ఎత్తు పెంచాలి. ఎత్తు తక్కువగా ఉండడంతో అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు వృథాగా కర్ణాటక వైపు పోతున్నాయి. మట్టి పెళ్లలు విరిగి పడి సప్లై ఛానల్ పూడిపోయింది. పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో చెరువుకు నీరందక పంటల సాగు కష్టమైంది. నాకున్న 1.5 ఎకరాల ఆయకట్టుకు పక్క రైతు పొలం నుంచి నీళ్లు విడిపించుకుని వరి సాగు చేస్తున్నా.
– నగేష్ రంగారెడ్డి, ఆయకట్టు రైతు, రొళ్ల


