సచివాలయంలో ల్యాప్‌టాప్‌ అపహరణ | - | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ల్యాప్‌టాప్‌ అపహరణ

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

రికార్డుల కాల్చివేత

ధర్మవరం అర్బన్‌: మంత్రి సత్యకుమార్‌ సొంత నియోజకవర్గ కేంద్రంలోని శివానగర్‌లో ఉన్న 5వ వార్డు సచివాలయంలో దుండగులు చొరబడి ల్యాప్‌టాప్‌ను అపహరించారు. పలు రికార్డులను కాల్చి వేశారు. సోమవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం సచివాలయానికి చేరుకున్న ఉద్యోగులు తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాలో భద్రపరిచిన ల్యాప్‌టాప్‌ కనిపించలేదు. బూడిదగా మారిన రికార్డులను గమనించి సమాచారం ఇవ్వడంతో అడిషనల్‌ ఎస్పీ అంకితా సురానా, ఇన్‌చార్జ్‌ డీఎస్పీ నర్శింగప్ప, టూ టౌన్‌ సీఐ రెడ్డప్ప, వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఉమాదేవి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

31న మాదిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ/ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివి 2026 పదో తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు ‘పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రతిభా పురస్కారాలు‘ అందజేయనున్నారు. ఈ మేరకు ఎంఈఎఫ్‌ జాతీయ అదనపు కార్యదర్శి బండారు శంకర్‌ సోమవారం వెల్లడించారు. దరఖాస్తులను ఎంఈఎఫ్‌ జిల్లా అధ్యకుడు రమేష్‌ వాట్సాప్‌ నంబర్‌ (99853 38646) ద్వారా అందజేయాలన్నారు. ఈ నెల 31న అనంతపురం 4వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉన్న ఏ7 కన్వెన్షన్‌ హాల్‌లో పురస్కారాలు అందజేస్తారని పేర్కొన్నారు.

అమ్మవారి వెండి ఆభరణాల అపహరణ

యాడికి: మండలంలోని కేశవరాయునిపేట సమీపంలో ఉన్న సుంకులమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి దుండగులు చొరబడి అమ్మవారి మూలవిరాట్‌ను అలంకరించిన 40 తులాల వెండి కిరీటం, ఆభరణాలను అపహరించారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి నారాయణమ్మ చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 40 కిలోల బరువైన వెండి ఆభరణాలను అపహరించికెళ్లినట్లుగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

ఆలయంలో చోరీ

పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లిలో వెలసిన పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి ప్రతిమ, 500 గ్రాముల వెండి గొడుగు, 5 గ్రాముల బంగారు తాళిబొట్లను అపహరించారు. ఉదయాన్నే గుడికి వెళ్లిన భక్తులు చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పూజారి గురుస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement