ఆగని దారి దోపిడీలు | - | Sakshi
Sakshi News home page

ఆగని దారి దోపిడీలు

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

రొళ్ల: మండల పరిధిలో దారి దోపిడీలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారు. తరచూ ఒకే ప్రాంతంలో దారి దోపిడీలు చోటు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. రొళ్ల మండలం హనుమంతనపల్లి గ్రామ పొలిమేరలో ఉన్న బైలాంజనేయస్వామి ఆలయం దారి దోపిడీ ముఠాకు అడ్డాగా మారింది. వివరాల్లోకి వెళితే.. బైలాంజనేయస్వామి ఆలయం రెండు వైపులా పూర్తిగా దిగువ ప్రాంతంలో ఉంది. అగ్రహారం, హనుమంతనపల్లి రెండు గ్రామాల పరిధిలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర రిజర్వు అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. బైలాంజనేయస్వామి ఆలయం సమీపాన ప్రధాన రోడ్డు దిగువ ప్రాంతం కావడంతో ఎంత గట్టిగా కేకలు వేసినా చుట్టుపక్కల వారికి వినిపించదు. దీనిని ఆసరాగా చేసుకున్న దుండగులు పట్టపగలే వాహనాలు అడ్డగించి దారి దోపిడీలు సాగిస్తున్నారు. ఆయా ఘటనలపై పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారే తప్ప దుండగులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మచ్చుకు కొన్ని..

● 2023 జూన్‌ 9న రాత్రి బైలాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రధాన రోడ్డుకు అడ్డుగా కంచెకు ఉపయోగించే ఇనుప తంతిని కట్టి దారి దోపిడీకి యత్నించారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనదారులు ఒకరి వెనుక మరొకరు వస్తూ ముళ్ల కంచెను గమనించి వాహనాలను ఆపారు. వేగంగా దూసుకెళ్లి ఉంటే ఛాతి లేక మెడకు తంతి తగిలి ప్రాణాపాయం కలిగేది.

● 2025 జూన్‌ 16న రొళ్ల మండలం హెచ్‌టీ హళ్లికి చెందిన వివాహిత అనిత పట్టపగలే ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బైలాంజనేయస్వామి ఆలయం వద్ద వాహనాన్ని దుండగులు అడ్డుకుని ఆమె మెడలోని 35 గ్రాముల బంగారు మాంగల్యం చైన్‌ లాక్కొని ఉడాయించారు.

● ఈ నెల 23న మధ్యాహ్నం టీడీపల్లి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి ద్విచక్ర వాహనంలో రొళ్ల నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఇద్దరు దుండగులు అడ్డుకుని అతని ఎడమ చేతి వేలికి ఉన్న దాదాపు రూ.1.50 లక్షల విలువైన బంగారు ఉంగరాన్ని లాక్కొని ఉడాయించారు.

అడ్డాగా మారిన బైలాంజనేయస్వామి ఆలయ ప్రాంతం

తరచుగా ఒకేచోట దారి దోపిడీలు

దుండగులను పట్టుకోవడంలో పోలీసుల విఫలం

Advertisement
 
Advertisement
Advertisement