విజయభాస్కర్‌ది సహజ మరణమే | - | Sakshi
Sakshi News home page

విజయభాస్కర్‌ది సహజ మరణమే

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

ఎస్పీ సతీష్‌కుమార్‌

మడకశిర: గుడిబండ మండలం మందలపల్లి గ్రామానికి చెందిన దళిత విజయభాస్కర్‌(24) ది సహజ మరణమేనని ఎస్పీ సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. సోమవారం మడకశిర రూరల్‌ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న మందలపల్లిలో విజయభాస్కర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఏప్రిల్‌ 22న విజయభాస్కర్‌ వెళ్లి అపస్మారకంగా పడిపోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ ఫోన్‌ ద్వారా విజయభాస్కర్‌ బంధువు సంతోష్‌కు తెలిపింది. సమాచారం అందుకున్న బంధువులు పుట్టలింగప్ప, హనుమంతరాయుడు, సోదరుడు హరీష్‌ ఘటనా స్థలానికి చేరుకుని విజయభాస్కర్‌ని వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అదే మోటార్‌ సైకిల్‌పై గుడిబండ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ పరిశీలించి విజయభాస్కర్‌ మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విజయభాస్కర్‌ను సదరు మహిళతో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేశారంటూ బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా అనుమానితులతో పాటు 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సాంకేతిక విశ్లేషణ అనంతరం విజయభాస్కర్‌పై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, అధిక మోతాదులో మద్యం సేవించడంతో పాటు కార్డియో మెగాలితో మృతి చెందినట్లుగా నిర్ధారణ అయింది. సహజ మరణం అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని ఎస్పీ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప, స్థానిక రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement