ధర్మవరం అర్బన్: నిద్రిస్తున్న మహిళను లేపి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన ధర్మవరంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని పార్థసారధినగర్‌లో వీఆర్‌ఓ బాలపెద్దన్న, లక్ష్మీదేవి దంపతులు నివాసముంటున్నారు. సోమవారం ఉదయం భర్త విధుల కోసం పెనుకొండకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి మధ్యాహ్న సమయంలో తలుపులు వేసుకుని నిద్రపోయారు. ఆ సమయంలో ఓ యువకుడు ఇంటి ఎదుట బైక్ ఆపి కాలింగ్ బెల్ నొక్కడంతో నిద్ర మేల్కొన్న లక్ష్మీదేవి తలుపు తీయగానే ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని బైక్‌పై ఉడాయించాడు. గొలుసు లాగే సమయంలో ఆమె గట్టిగా పట్టుకోవడంతో చేతిలో ఓ ముక్క తెగి పడింది. ఆమె కేకలు విన్న చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకునేలోపు యువకుడు కనిపించకుండా పోయాడు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


