హనుమా.. భక్తుల కష్టాలు కనుమా.. | - | Sakshi
Sakshi News home page

హనుమా.. భక్తుల కష్టాలు కనుమా..

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

గుంతకల్లు రూరల్‌: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో వసతి గదుల లేమి పట్టిపీడిస్తోంది. ఆలయంలో భక్తులకు అవసరమైన వసతి గదులు లేకపోవడం, అంతంత మాత్రంగా ఉన్న వసతి గదులు కాస్తా అభివృద్ధి పనుల్లో భాగంగా వచ్చిన వర్కర్లకే సరిపోతుండటంతో భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేటు అద్దె గదులకు భారీ మొత్తంలో ఖర్చుచేయలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆలయ ప్రాంగణంలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది.

ఏటా రూ.12.47 కోట్ల వార్షిక ఆదాయం

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఏటా రూ.12.47 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. అయినా కూడా దేవస్థానంలో ముందునుంచి వసతి గదుల లేమి భక్తులను వెంటాడుతూనే ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆలయంలో భక్తుల వసతి కోసం, లక్ష్మణ సదనంలో 39 రూములు (అద్దె రూ.50), కేసరి సదనంలో 28 అద్దె గదులు (అద్దె రూ.500), ఉండేవి. గంగా నిలయం ప్రాంగణంలో దాదాపు 12 కాటేజీలు ఉండేవి. రామదూత నిలయంలో 20 ఏసీ, నాన్‌ ఏసీ అద్దె గదులు (అద్దె రూ.1500) మాత్రమే ఉండేవి. అయితే 9 నెలల క్రితం ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టిన మేడేపల్లి విజయరాజు దాతల సహకారంతో ఆలయంలో నూతన గర్భాలయం, విమాన గోపురం, ముఖ మండపం, గోశాల, ప్రసాదాల తయారీశాల వంటి వాటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఆలయంలో మాడ వీధుల ఏర్పాటులో భాగంగా అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మణ సదనంలోని 39 అద్దె గదులను కూల్చేశారు. అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాక ఆ పనుల నిమిత్తం వచ్చిన వర్కర్లకు కేసరి సదనంలోని అద్దె గదులను, హోదా గల వారికి గంగా నిలయంలోని కాటేజెస్‌ను కేటాయించారు. దీంతో ప్రస్తుతం కేసరి సదనంలో 13 అద్దె గదులు, రామదూతలో ఉన్న 20 అద్దె గదులు మాత్రమే భక్తులకు కేటాయిస్తున్నారు.

మంగళ, శనివారాల్లో వేలాదిగా భక్తులు

మంగళ, శనివారాల్లో వేల సంఖ్యలో ఆలయానికి వచ్చే భక్తులకు ఉన్న అద్దె గదులు ఏమాత్రం సరిపోకపోవడంతో భక్తులు ఆలయ ముందు భాగంలో ఆరుబయటనే నిద్రించాల్సి వస్తుంది. అయితే శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మొదలైన వర్షం రాత్రంతా జల్లులతో కొనసాగడంతో భక్తులు షెడ్ల దగ్గరికి పరుగులు తీశారు. భక్తులు భారీ సంఖ్యలో ఉండటంతో పడుకోవడం మాట అటుంచితే కనీసం షెడ్ల కింద కూర్చోవడానికి కూడా స్థలం లేక నానా అవస్థలు పడ్డారు. త్వరలోనే వర్షాకాలం ప్రారంభమవుతుందని, అప్పుడు ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

వసతి గదుల సముదాయం నిర్మాణం ఎన్నడో...

ఆలయ అభివృద్ధిలో భాగంగా దాతల సహకారంతో వివిధ రకాల పనులను చేపడుతున్న ఆలయ అధికారులు రూ.17.60 కోట్ల అంచనా వ్యయంతో 107 వసతి గదులతో జీప్లస్‌టు సముదాయాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అయితే అన్ని రకాల పనులు ప్రారంభం అయినప్పటికీ వసతి గదుల సముదాయ నిర్మాణం మాత్రం ఫ్లెక్సీలకే పరిమితమైంది. దీంతో భక్తుల కష్టాలు కొనసాగుతూనే వస్తున్నాయి. భక్తులకు అవసరమైన వసతులు సమకూరితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందన్న విషయం ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

వసతి గదుల లేమితో ఆలయ ప్రాంగణంలోనే సేదదీరుతున్న భక్తులు

కసాపురంలో వసతి గదుల లేమితో భక్తుల ఇక్కట్లు

ఆలయ ప్రాంగణంలోనే నిద్ర

ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అవస్థలు

Advertisement
 
Advertisement
Advertisement