అనంతపురం కల్చరల్: అరసం (అభ్యుదయ రచయితల సంఘం) రాష్ట్ర అధ్యక్షుడిగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈనెల 23, 24 తేదీల్లో తిరుపతిలో అరసం 20వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అరసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్కేయూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అనంత సాహితీక్షేత్రంలోనే దశాబ్దాలుగా స్థిరనివాసమేర్పరచుకున్న డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డిని అరసం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన సీనియర్ రచయితలు గుత్తా హరిసర్వోత్తమనాయుడు, ఈశ్వరరెడ్డి, వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి, తన్నీరు నాగేంద్రలకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. తిరుపతి మహాసభల్లో అనంత రచయితలు ద్విభాషా కవి డాక్టర్ జూటూరు షరీఫ్, చెట్ల ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
కండక్టర్ నిజాయితీ
● బంగారు నగలు, డబ్బు ఉన్న పర్సు అందజేత
హిందూపురం: ప్రయాణికురాలు బస్సులో మర్చిపోయిన బంగారు నగలు, డబ్బు ఉన్న బ్యాగ్‌ను తిరిగి ఆమెకు అప్పగించి కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు.. ఆదివారం కదిరి నుంచి హిందూపురం వెళ్లే పల్లె వెలుగు సర్వీస్‌లో లచ్చమ్మ ప్రయాణించారు. గోరంట్లలో బస్సు ఎక్కిన ఆమె హిందూపురంలో దిగేటప్పుడు తన పర్సును పోగొట్టుకుంది. బస్సు కండక్టర్ శ్రీనివాసులు ఆ పర్సును గమనించిన హిందూపురం డిపో కంట్రోలర్ నాగచంద్రుడికి అందించారు. పర్సు పోగొట్టుకున్న లచ్చమ్మ ఆందోళనతో అంత వెతికుతూ బస్టాండ్ కంట్రోల్ పాయింట్‌లో తన పర్సు బస్సులో పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. పర్సులో నాలుగు తులాల బంగారు చైన్, రెండు మొబైల్స్, కొంత డబ్బు ఉందని చెప్పింది. ప్రయాణికురాలు చెప్పిన వివరాలు అన్ని సరిగా ఉండటంతో పోగొట్టుకున్న పర్సును ఆర్టీసీ సిబ్బంది లచ్చమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కండక్టర్ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీనివాసులును నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు, తోటి ఉద్యోగులు అభినందించారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
నల్లచెరువు: మండల పరిధిలోని పాత రైల్వేస్టేషన్ సమీపంలో కదిలే రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాలమేరకు.. కదిరి పట్టణంలోని జగనన్న కాలనీ చెందిన రాము రైలులో చిన్న పిల్లల బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాము రైలులో ఫుట్‌పాత్ వద్ద నిలబడి ఉన్నాడు. అయితే పాత రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా రైలు నుంచి కాలు జారి కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గవిమఠం ఏజెంట్
రాజన్నగౌడ్ మృతి
ఉరవకొండ: ఉరవకొండ గవిమఠం ఏజెంట్ పాటిల్ రాజన్నగౌడ్ (72) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఆదివారం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. 20 ఏళ్లుగా గవిమఠం ఏజెంట్‌గా పనిచేస్తూ ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామికి సేవలందిస్తున్నారు. గవిమఠం పీఠాధిపతులు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, ఆదోని చోకి మఠం పీఠాధిపతులు కల్యాణస్వామీజీ, మఠం సిబ్బంది గోపి, నారాయణస్వామి, మధు తదితరులు రాజన్నగౌడ్ మృతికి సంతాపం తెలిపారు.


