సజావుగా సివిల్స్‌ ప్రిలిమినరీ | - | Sakshi
Sakshi News home page

సజావుగా సివిల్స్‌ ప్రిలిమినరీ

May 25 2026 10:03 AM | Updated on May 25 2026 10:03 AM

అనంతపురం అర్బన్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమనరీ పరీక్ష అనంతపురంలో సజావుగా జరిగింది. అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. రెండు సెషన్లుగా ఏడు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,514 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం సెషన్‌కు 1,658 మంది అభ్యర్థులు (66 శాతం) హాజరవగా 856 మంది (34 శాతం) గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం సెషన్‌కు 1,635 మంది అభ్యర్థులు (65 శాతం) హాజరుకాగా 879 మంది (35 శాతం) గైర్హాజరయ్యారు. రెండు సెషన్లూ కలిపి అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. యూసీఎస్‌పీ జిల్లా పరిశీలకులు గంధం చంద్రుడు, కలెక్టర్‌ ఆనంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భ్రద్రత ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు అందుబాటులో ఉంచారు.

ఆలస్యమై బాధతో వెనుదిరిగి..

నిర్దేశిత సమయం తరువాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి లోనికి అనుమతించలేదు. దీంతో వారంతా బాధతో వెనుదిరిగారు. అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే తమ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ప్రత్యేకంగా సూచించారు. యూపీఎస్‌సీ నిబంధన మేరకు ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కొందరు అభ్యర్థులు సమాయానికి చేరుకోలేక పోయారు. దీంతో వారిని లోనికి అనుమతించలేదు. ఆర్ట్స్‌ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షకు మహబూబ్‌, చరిత్ర, మౌళి, హర్ష, కుమార్‌, నందకిషోర్‌, నరేష్‌, యువరాజ్‌, శ్రావణ్‌ (కర్నూలు), మరికొంత మంది అభ్యర్థులు తొమ్మిది గంటల తరువాత కేంద్రానికి చేరుకున్నారు. నిబంధన ప్రకారం వారిని లోనికి అనుమతించలేదు. ఇలాగే మిగతా ఆరు కేంద్రాల్లోనూ కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో లోనికి అనుమతించలేదు.

అభ్యర్థుల హాజరు

65.5 శాతం నమోదు

Advertisement
 
Advertisement
Advertisement