అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో ఉన్నతస్థాయి పదవుల భర్తీలో సామాజిక న్యాయానికి పాతర వేశారు. ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ జ్యోతికుమార్ పూర్తిస్థాయి వీసీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రిజిస్ట్రార్‌గా రిజర్వేషన్ కేటగిరీ వర్గాలకు కేటాయిస్తారని అందరూ భావించారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన ఔత్సాహిక ప్రొఫెసర్లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే రిజిస్ట్రార్‌గా ఉన్న రమేష్‌బాబును మార్పు చేయకుండా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లే లేనట్లు నాన్ టీచింగ్ విభాగంలో రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్‌గా ఉన్న రమేష్‌బాబును ఎలా రిజిస్ట్రార్‌గా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా రిజిస్ట్రార్ పదవి రిజర్వేషన్ వర్గాలకు దక్కనీయకుండా సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇంతకుముందు రెక్టార్‌గా ప్రొఫెసర్ వెంకటనాయుడు ఉండేవారు. దీంతో వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్‌గా ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కొలువుదీరడంతో... ప్రొఫెసర్ వెంకటనాయుడు రెక్టార్ పదవికి రాజీనామా చేశారు. దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ బి.అనితకు రెక్టార్ పదవిని అప్పగించారు.
గతంలో పెద్దపీట
గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఎస్కేయూ కీలక పదవుల్లో ఎస్సీ, బీసీ కేటగిరి వర్గాలకు న్యాయం జరిగింది. అప్పట్లో వీసీగా రహంతుల్లా, రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డిని నియమించారు. రహంతుల్లా రాజీనామా చేయడంతో ఇన్‌చార్జ్ వీసీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ అయిన అహ్మద్‌బాబుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇన్‌చార్జ్ వీసీగా ప్రొఫెసర్ జయరాజ్‌ను నియమించారు. ఆయన గుండెపోటుతో చనిపోయాక తిరిగి ఇన్‌చార్జ్ వీసీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.రాజశేఖర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మల్లికార్జునరెడ్డి రిజిస్ట్రార్‌గా రాజీనామా చేశారు. మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి వీసీగా నియమితులైన తరువాత రిజిస్ట్రార్‌గా బీసీ కేటగిరీకి చెందిన ప్రొఫెసర్ రమణ (కెమిస్ట్రీ)ను నియమించారు. అనంతరం బీసీ కేటగిరీకి చెందిన ప్రొఫెసర్ కృష్ణకుమారి, ఎస్సీ కేటగిరికి చెందిన ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య రిజిస్ట్రార్‌లుగా పనిచేశారు. ఆనాడు వీసీ ఓపెన్ కేటగిరీ వారు అయితే.. బీసీ, ఎస్సీ కేటగిరీ వర్గాలకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు.
ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్‌గా ఒకే సామాజికవర్గం వారు
రిజర్వేషన్ కేటగిరీలకు రిజిస్ట్రార్ పదవి అందని ద్రాక్షేనా?


