పెనుకొండ: సోమందేపల్లి మండలం మంచేపల్లిలో ఆదివారం సర్పాలు సయ్యాటలాడాయి. రెండూ పెనవేసుకుని అంతెత్తు పైకిలేస్తూ ముందుకు సాగాయి. దాదాపు రెండు గంటలపాటు సాగిన సయ్యాటను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.
వివాహిత నిరాహార దీక్ష
పెనుకొండ: అనంతపురానికి చెందిన అశ్విని అనే వివాహిత పట్టణంలోని భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. వివరాలు... అనంతపురానికి చెందిన అశ్వినికి పట్టణంలోని ఓ యువకుడితో 1996లో వివాహమైంది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో అశ్విని అనంతపురానికి వెళ్లిపోయింది. అయితే కోర్టులో విడాకుల కేసు జరుగుతున్న నేపథ్యంలో తమ కుటుంబం ఇచ్చిన బంగారు నగలు ఇవ్వాలని పెనుకొండ పట్టణంలోని భర్త ఇంటి వద్దకు వచ్చింది. తలుపులు మూసి వేయడంతో అశ్విని ఆమె కుమారుడితో కలిసి నిరాహార దీక్షకు దిగింది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామం వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వివరాలు... పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 19 వార్డు ప్రశాంతి గ్రామం వద్ద చంద్రశేఖర్, లక్ష్మి దంపతులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కూడా హోటల్ పెట్టుకున్నారు. అయితే ఉన్నఫలంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన మంటలు అదుపులోకి రాలేదు. ఆఖరికి ఫైర్‌సిబ్బందికి ఫోన్ చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన వల్ల రూ.లక్ష నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధి కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


