అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినపుడు రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించేది పంటల బీమా. అటువంటి పథకాన్ని చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తం చేసింది. అసలు బీమా పథకం అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా స్పష్టత ఇవ్వకుండా మాయ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఖరీఫ్, రబీకి సంబంధించి నాలుగు సీజన్లు ముగిసినా రైతుకు పైసా కూడా బీమా అందలేదు.
ప్రీమియం చెల్లించినా.. రిక్తహస్తమే
రాష్ట్రంలో పంటల బీమా పథకాలు 1999లో అమలులోకి వచ్చాయి. నిబంధనలు మారుతూ వస్తున్నా ఏటా బీమా పథకం మాత్రం అమలు చేస్తూ వచ్చారు. 2025 రబీలో తొలిసారిగా బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. అంతకు మునుపు 2025 ఖరీఫ్‌లో బీమా కోసం జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది రైతులు తమ వాటా కింద ప్రీమియం చెల్లించారు. 2024 రబీలో కూడా 35 వేల మంది పప్పుశనగ రైతులు ప్రీమియం చెల్లించారు. పంటలు దెబ్బతిన్న సమయంలో బీమా పరిహారం మాత్రం అందలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. ఇప్పుడు 2026 ఖరీఫ్ మొదలవుతుండగా పంటల బీమా పథకాలు ఉన్నాయా లేదా అనేది అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల పంపిణీలో ప్రీమియం కట్టాలా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
జగన్ హయాంలో 18 పంటలకు బీమా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులపై పైసా భారం పడకుండా ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించి నిబంధనల మేరకు బీమా కింద పరిహారం ఇస్తూ వచ్చారు. ఏటా ఖరీఫ్‌లో 12 రకాల పంటలు, రబీలో ఆరు రకాల పంటలకు అటు వాతావరణ బీమా, ఇటు ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకాలు వర్తింపజేశారు. ఈ–క్రాప్ ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసి నిబంధనలకు అనుగుణంగా నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఏకంగా రూ.1,882 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చారు. అందులో అనంతపురం జిల్లా రైతులకు రూ.1,160.19 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా రైతులకు రూ.722.61 కోట్ల బీమా పరిహారం జమ అయింది.
రెండేళ్లుగా పంటల బీమా కింద
పరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కారు
ఉచితానికి మంగళం పాడేసి ప్రీమియం భారం మోపినా ప్రయోజనం నిల్
వైఎస్ జగన్ హయాంలో జిల్లా రైతులకు రూ.1,882 కోట్ల బీమా పరిహారం
ప్రీమియం లేకుండా ఉచితంగా పంటల బీమా పథకాలతో అప్పట్లో రైతుల్లో ధీమా


