సా..గుతున్న ఎన్‌హెచ్‌ పనులు | - | Sakshi
Sakshi News home page

సా..గుతున్న ఎన్‌హెచ్‌ పనులు

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

పుట్టపర్తి అర్బన్‌: జాతీయ రహదారి–342 నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం పనులు నెమ్మదించాయి. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకల్లా అందుబాటులోకి రావాల్సిన రోడ్డు ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసిన అనంతరం కనెక్టివిటీ పెంచేందుకు, తద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 82 కిలోమీటర్ల మేర ఏర్పాటయ్యే రోడ్డుకు రూ.1,745 కోట్లు విడుదల చేశారు. ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి, గోరంట్ల మీదుగా కోడూరు వరకూ నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు.

అంతా ఇష్టారాజ్యం..

ముదిగుబ్బ నుంచి ప్రారంభమయ్యే జాతీయ రహదారి–342 పనులను మూడు విడతలుగా చేపడుతున్నారు. మొదటి విడతలో భాగంగా బుక్కపట్నం వరకూ పనులు పూర్తవడంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా జగరాజుపల్లి నుంచి కోడూరు వరకూ పనులు జరుగుతున్నాయి. బత్తలపల్లి సమీపంలో టోల్‌గేట్‌, గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి వద్ద ఫ్లై ఓవర్‌ పనులు చేపడుతున్నారు. ఇంకా ఎక్కడా సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయలేదు. గ్రామాల్లోకి వెళ్లే చోట తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పుట్టపర్తి పట్టణంలోకి వెళ్లడానికి రోడ్డు కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా తొలగించిన బండరాళ్లు, మట్టిని పొలాల వద్ద ఇష్టారాజ్యంగా వేయడంతో రైతుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. ఎప్పటికప్పుడు బిల్లులు వస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు ఆలస్యం చేస్తున్నట్లు తెలిసింది. రెండో విడత పనుల్లో భాగంగా ఇంకా బడేనాయక్‌ తండా, ఎనుములపల్లి వద్ద రెండు కొండలు తొలగించాల్సి ఉంది. రహదారి అందుబాటులోకి వస్తే పుట్టపర్తి నుంచి కేవలం రెండున్నర గంటల్లో బెంగళూరు చేరుకునే వీలుండడంతో ప్రజలంతా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా పనులను వేగిరం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లావాసులు, సత్యసాయి భక్తులు కోరుతున్నారు.

మూడేళ్లవుతున్నా పూర్తి కాని

జాతీయ రహదారి– 342

చంద్రబాబు ప్రభుత్వమొచ్చాక

నెమ్మదించిన పనులు

ప్రజలకు తప్పని ఇబ్బందులు

Advertisement
 
Advertisement
Advertisement