వీరభద్రుని సేవలో జస్టిస్‌ చిత్తరంజన్‌దాస్‌ | - | Sakshi
Sakshi News home page

వీరభద్రుని సేవలో జస్టిస్‌ చిత్తరంజన్‌దాస్‌

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

లేపాక్షి: లేపాక్షిలో వెలసిన వీరభద్ర స్వామిని ఆదివారం సాయంత్రం ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చిత్తరంజన్‌దాస్‌ దర్శించుకున్నారు.కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు నరసింహశర్మ,శ్రీనివాసులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించిన జస్టిస్‌ చిత్త రంజన్‌దాస్‌ ఆనందం వ్యక్తం చేశారు. దుర్గాదేవి, వీరభద్ర స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకుల ద్వారా తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో న్యాయమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు.

నేడు కలెక్టరేట్‌లో

పరిష్కార వేదిక

ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, మునిసిపల్‌, మండల కార్యాలయా ల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మౌంటెనీర్‌ సందీప్‌ మృతి.. ‘పురం’లో విషాదఛాయలు

హిందూపురం: పర్వతారోహకుడు (మౌంటెనీర్‌) సందీప్‌ అరే మృతితో హిందూపురంలో విషాదఛాయలు అలుము కున్నాయి. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అనంతరం కిందకు దిగుతున్న క్రమంలో ఐదు రోజుల క్రితం ఆయన మృత్యువాత పడిన విషయం తెలిసిందే. హిందూపురానికి చెందిన ఆర్‌అండ్‌బీ రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నారాయణస్వామి కుమారుడైన సందీప్‌ అరే (46) బెంగళూరులో స్థిరపడ్డారు. గతంలో కిలిమంజారో శిఖరాన్ని ఆయన అధిరోహించారు. యూపీకి చెందిన అరుణ్‌ కుమార్‌ తివారితో కలిసి సందీప్‌ అరే ఈ నెల 20న ఎవరస్ట్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. తిరుగు ప్రయాణంలో విపరీతమైన మంచు గాలుల కారణంగా శ్వాస ఆడక ఇద్దరూ మృతి చెందారు. సందీప్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement